బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

5 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ‌ఆమోదం

58 నిమిషాల క్రితం

cabinet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 12:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- తిరుపతి, చిత్తూరు జిల్లాలను కవరు చేయనున్న ప్రాజెక్టు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 17 జిల్లాలను కవర్‌ చేసే ఐదు మల్టీ ట్రాకింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం బుధవారం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రివర్గం నిర్ణయాలను వెల్లడించారు. రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో 2029-30 నాటికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఐదు మల్టీ ట్రాకింగ్‌ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. అరక్కోణం – రేణిగుంట (రూ.1,936 కోట్లు) మధ్య 77 కిలోమీటర్ల మేర మూడు, నాలుగో రైల్వే లైన్లు, సికింద్రాబాద్ (ఘట్‌కేసర్) – కాజీపేట (రూ.2,419 కోట్లు) మధ్య 110 కిలో మీటర్ల మేర మల్టీ-ట్రాకింగ్ లైన్, వైట్‌ఫీల్డ్ – బంగారపేట (రూ.1,476 కోట్లు) మధ్య 47 కిలోమీటర్ల మేర మూడు, నాలుగో రైల్వే లైన్లు, హోసూరు – ఓమలూరు (రూ.1,946 కోట్లు) మధ్య 147 కిలోమీటర్ల మేర డబ్లింగ్, సేలం – కరూర్ – దిండిగల్ (రూ.2,242 కోట్లు) మధ్య 159 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌‌కు ఆమోదం తెలిపిందన్నారు.

రాష్ట్రంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలను, తెలంగాణలో మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్ అర్బన్ జిల్లాలను ఈ ప్రాజెక్టులు కవరు చేస్తాయి. ఈ ప్రాజెక్టులతో ఇండియా రైల్వే నెట్‌వర్క్‌ సుమారు 540 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 2,121 గ్రామాలకు మెరుగైన రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. దాదాపు 52 లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలగనుంది.

పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కలుపుతూ చేపట్టనున్న మూడు మల్టీట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.10,783 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులు 2029–30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్