సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం డిమాండ్
ప్రజాశక్తి - పాడేరు (అల్లూరి జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనకు రానున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గిరిజన ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఉపాధి కల్పించే జిఒ నంబర్ 3 ప్రత్యేక రిజర్వేషన్ అమలుపై ప్రకటన చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం డిమాండ్ చేశారు. బుధవారం పాడేరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... జిఒ 3కి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం నాటకం ఆపాలని, కమిటీల పేరుతో ఆలస్యం చేయరాదన్నారు. గత డిఎస్‌సిలో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, 2026 జాబ్ కేలండర్‌లో కూడా అన్యాయం కొనసాగుతోందని తెలిపారు. హైడ్రో ప్రాజెక్టులు, టూరిజం కోసం రాత్రికి రాత్రి జిఒలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఆదివాసీలకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పనలో మాత్రం గత వైసిపి ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తోందని వివరించారు. 1/70 చట్టం పరి రక్షణకు కోసం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేయకుండా కాలయాపన చేస్తున్నారని, గిరిజన హక్కులు కాపాడే విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. సిఎం అరకు పర్యటన రోజు జిఒ 3 ప్రత్యేక రిజర్వేషన్, 1/70 చట్టంపై స్పష్టమైన ప్రకటన చేయని పక్షంలో భవిష్యత్తులో జరిగే ప్రజా ఉద్యమాలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఎల్‌నినో ప్రభావం, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ సంవత్సరం కరువు తాండవించే పరిస్థితి ఏర్పడిందని, చెక్ డ్యామ్‌ల నిర్మాణాలు లేకపోవడం వల్ల నీటి రక్షణ కరువై కరువు కాటకాల్లోకి వెళ్తే పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో 95 వేల స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం మూసేస్తే అదే బాటలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. విశాఖపట్నంలో గిరిజన విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న మారికవలస గురుకుల పాఠశాలను తల్లిదండ్రుల అనుమతి లేకుండా అర్ధాంతరంగా మూసివేస్తుండటం అన్యాయమన్నారు. ఇది గిరిజన విద్యను మరింత నాశనం చేసి ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా ఉందని విమర్శించారు. ఐటిడిఎ నిధులతో నడుస్తున్న మారికవలస స్కూల్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, అప్పుడే డోలీ మోతల నివారణ, విద్యార్థుల, ప్రజా మరణాల నివారణ సాధ్యమని అన్నారు. మాయ మాటలకు కాలం చెల్లిందని, ఆదివాసీ యువకులు వాస్తవాలు తెలుసుకున్నారని, ఉద్యమం, పోరాటంలో భాగస్వామ్యం పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సురేంద్ర, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, అనంతగిరి జడ్‌పిటిసి సభ్యులు డి.గంగరాజు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)