- అశాస్త్రీయ పరిహారానికి మరో నిండు ప్రాణం బలి
- గత్యంతరం లేని పరిస్థితుల్లో ముంపు భూమిలోనే అంత్యక్రియలు
ప్రజాశక్తి-మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేళ ముంపు గ్రామాల నిర్వాసితుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్న తరుణంలో.. కొద్దిగంటల ముందే భూ నిర్వాసితురాలు గోతం రోశమ్మ (65) గుండెపోటుతో కన్నుమూశారు. పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన ఆమె అకాల మరణంతో నిర్వాసితుల ఇళ్లల్లో శోకసంద్రం అలుముకుంది. మృతురాలికి ఆమె భర్త వీరయ్యకు కలిపి ఒక ప్యాకేజీ పరిహారం అందింది. కానీ ఆమె కుమారుడు చిన్న వీరయ్య, మనవళ్లైన వీరాంజనేయులు, రామాంజనేయులు, మనవరాలైన అనంతమ్మకు కలిపి మొత్తం నాలుగు ప్యాకేజీల అవార్డు మంజూరుకు అన్ని అర్హతలూ కలిగి ఉన్నా జాబితాలో పేర్లు లేవు. పిల్లల భవిష్యత్తును తలుచుకుంటూ రోశమ్మ కలత చెందేవారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తాము అద్దెకు ఉంటున్న పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలోని స్కూలు వద్ద గుండెపోటుకు గురై రోశమ్మ మరణించారు.
మంటకలిసిన మానవత్వం
పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి.. ఇంట్లో మరణం సంభవించడం అశుభమంటూ, తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని నిర్దయగా షరతు పెట్టారు. దిక్కుతోచని స్థితిలో, కడసారి చూపునకు కూడా నిలువ నీడ లేక, ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చివరకు చేసేదేమీ లేక, తాము ప్రాణప్రదంగా దాచుకున్న, ప్రస్తుతం వెలిగొండ ప్రాజెక్టు ముంపునకు గురైన కలనూతల పాత గ్రామంలోని తమ సొంత ప్రాంతంలోనే రోశమ్మ భౌతికకాయాన్ని పూడ్చిపెట్టారు. ప్రాజెక్టు కోసం సర్వస్వం ధారపోసిన నిర్వాసితుల ఈ దుస్థితి పట్ల స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. సర్వం త్యాగం చేసిన ముంపు గ్రామాల నిర్వాసితులకు మంజూరైన పరిహారంలో చోటుచేసుకున్న అశాస్త్రీయ విధానం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.








కామెంట్‌లు (0)