దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టండి
కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భారత తూర్పు తీరంలో మారిటైమ్ వ్యాపారానికి సుదూర తీరప్రాంతం కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని విద్య, ఐటి, ఎలక్ర్టానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒక మేజర్, 5 నాన్ మేజర్ ఆపరేషనల్ పోర్టుల ద్వారా ప్రతియేటా 330 మిలియన్ టన్నులకు పైగా సరుకుల రవాణా జరుగుతోందని వివరించారు. కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యాన దక్షిణ కొరియాలోని బుసాన్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ బుధవారం పాల్గొని మాట్లాడారు. భారత్‌లో మొట్టమొదటి స్టేట్ అప్రూవ్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ దుగరాజపట్నంలో రూ.30 వేల కోట్లతో 3,488 ఎకరాల్లో నిర్మితమవుతోందని తెలిపారు. ఎపి మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సంయుక్తంగా విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో అభివృద్ధి చేస్తున్న ఈ క్లస్టర్ శ్రీసిటీ, కృష్ణపట్నం పోర్టులకు సమీపంలో ఉండటంతోపాటు కనెక్టివిటీ కలిగి ఉందని వెల్లడించారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్‌లో టెస్టింగ్/సర్టిఫికేషన్ ల్యాబ్‌లతో పాటు ఇంజిన్లు, ప్రొపల్షన్, నావిగేషన్, డెక్ మెషినరీ, ఎలక్ట్రికల్స్, అవుట్ ఫిట్టింగ్, ప్రత్యేక మెరైన్ పరికరాల తయారీ, అనుబంధ పార్కును ఏర్పాటు చేయాలని సభ్యులను స్వాగతిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో హాన్లా ఐఎంస్, హ్యుందయ్ వెల్డింగ్, డేసన్ షిప్ యార్డు, సన్ బో ఇండస్ట్రీస్, ఓరియంటల్ ప్రెసిషన్ అండ్ ఇంజినీరింగ్, ఫైన్ కొరియా, జేవో ఇంజినీరింగ్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
అపెక్స్ కొరియా పేరుతో పెట్టుబడిదారుల సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన లోకేష్
ఎపిఇడిబి ఆధ్వర్యాన అపెక్స్ – కొరియా పేరుతో పెట్టుబడిదారుల సహాయక, అనుసంధాన విభాగాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తిచూపే కొరియా సంస్థలకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య అపెక్స్ కొరియా అనుసంధానకర్తగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఎపిఇడిబి సిఇఒ సగిలి షన్మోహన్, ఎపి మారిటైమ్ బోర్డు సిఇఒ ప్రవీణ్ ఆదిత్య, పరిశ్రమలశాఖ కమిషనర్ శుభం బన్సాల్, దక్షిణ కొరియాకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
దక్షియా కొరియా నాల్గో రోజు పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాజధాని అమరావతిలో బిఎన్‌కె ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటుచేయాలని ఆ సంస్థ గ్రూప్ ఎమ్‌డి లీ క్వాంగ్ జున్, సిఇఒ సన్ డే జిన్, మేక్ ఇన్ ఇండియా కొరియా ఛైర్మన్ జంగ్ డియోక్ మిన్ ఎస్‌బి బో కంపెనీ ఛైర్మన్ క్యూమ్ సిక్, హ్యుందయ్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ చోయ్ సియుంగ్ హూన్‌ను లోకేష్ కోరారు. పెట్టుబడులు, నిధుల నిర్వహణ, కన్సల్టింగ్ సేవల ద్వారా సార్టప్ లు, ఎస్ఎంఇలకు మద్దతు ఇచ్చేందుకు బిఎన్‌కె వెంచర్ క్యాపిటల్ సంస్థ రాష్ట్రంలోని ఆర్‌టిఐహెచ్‌లో మెంబర్/మెంటర్‌గా చేరాలని లోకేష్ ఆహ్వానించారు. రాష్ట్రంలో బూయంగ్ గ్రూప్ పాదరక్షలు, విడి భాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ సిఇఒ అండ్ ప్రెసిడెంట్ డైరెక్టర్ ర్యాన్ కాంగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్‌సన్‌లను కోరారు. ఫుట్‌వేర్, మెటీరియల్స్, ఆటోమోటివ్ కాంపొనెంట్స్, ఒడిఎం స్పోర్ట్ ఫ్యాషన్ పరికరాల తయారీ కంపెనీ హ్వాసంగ్ గ్రూప్ ఉన్నతస్థాయి బృందంతో భేటీ అయ్యారు. కుప్పంలో హ్వాసంగ్ పాదరక్షల తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఇంటిగ్రేటెడ్ ఫుట్‌వేర్ కాంపొనెంట్ అండ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా కుప్పంలోనే ఏర్పాటు చేయాలని సూచించారు.








కామెంట్‌లు (0)