వేలాది మంది ప్రజల అశ్రు నివాళి
టెహ్రాన్ : ఇరాన్‌పై దాడులు చేస్తామని ట్రంప్ బెదిరింపులు కొనసాతున్నాయి. మరోవైపు అమెరికా హెచ్చరికలు లెక్కచేయకుండా సుప్రీం లీడర్ అంత్యక్రియలకు భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతున్నారు. అమెరికా దాడుల తొలి రోజే మరణించిన ఇరాన్ మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేని అంత్యక్రియల ప్రదర్శన బుధవారం ఇరాక్ నగరమైన నజఫ్‌లో ప్రారంభమైంది. వేలాదిమంది ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ నెల 4న అంత్యక్రియల కార్యక్రమాలు ప్రారంభమవడంతో అధికారులు వీధులను, గగనతలాన్ని మూసివేశారు. రోజువారీ జీవనం స్తంభించిపోయింది. ఒక వైపు పశ్చిమ దేశాలతో పోరాడుతునే, దశాబ్దాల తరబడి తన ఉక్కు పిడికిలితో ఇరాన్‌కు నాయకత్వం వహించిన తమ ప్రియతమ నేతకు ప్రజలు అశ్రు నివాళి అర్పించారు. నజఫ్ నగరంలో ప్రదర్శన అనంతరం ఖమేనీ మృతదేహాన్ని కర్బాలా నగరానికి తీసుకెళతారు. అనంతరం ఇరాన్‌కు తిరిగి తీసుకువస్తారు. ఖననం పూర్తయ్యేవరకు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు నిలిచినట్లు కనిపిస్తోంది. అయితే, మంగళ, బుధవారాల్లో ఇరు పక్షాల మధ్య దాడులు కొనసాగడంతో తాత్కాలిక ఒప్పందం ముప్పు ముంగిట వుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించే నజఫ్ నగరానికి ఖమేనీ భౌతిక కాయం చేరుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి, ఇతర సీనియర్ అధికారులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఇరాన్ జాతీయ పతాకాన్ని చుట్టిన గాజు పెట్టెలో ఖమేనీ భౌతిక కాయాన్ని వుంచారు. ఇరాన్ పతాకాలతో పాటూ సంతాపం, ప్రతీకారాన్ని ప్రతిబింబించేలా నలుపు, ఎరుపు రంగు పతాకాలను కూడా ప్రదర్శించారు. ‘శత్రువు కళ్లలో ముల్లులా ఇరాక్ ప్రజలు వుంటారు.’ అని అంత్యక్రియల ప్రదర్శనలో పాల్గొన్న జాఫర్ జావేద్ వ్యాఖ్యానించారు. పలు రోజుల పాటు కొనసాగనున్న ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ కొత్త నేత ముజ్తబా ఖమేనీ ఇప్పటివరకు కనిపించలేదు. తన తండ్రి మరణించిన దాడుల్లోనే ఆయన కూడా తీవ్రంగా గాయపడినట్లు భావిస్తున్నారు.








కామెంట్‌లు (0)