మంత్రి జనార్ధన్‌రెడ్డితో ఆ రాష్ట్ర మంత్రి నితేష్ రాణే భేటీ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో అమలు చేస్తున్న మౌలికాభివృద్ధి విధానాలను మహారాష్ట్ర పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో కూడిన ఉన్నతాధికారుల బృందం సోమవారం పరిశీలించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర మౌలికాభివృద్ధి, పెట్టుబడులశాఖ మంత్రి బిసి జనార్ధన్‌రెడ్డితో సచివాలయంలో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో మారిటైమ్, పోర్టులు, షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధిపై ఇరువురు మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి జనార్ధన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు సిఇఒ ప్రవీణ్ ఆదిత్య, సిఇ రాఘవరావు తదితరులు మంత్రి నితేష్ రాణే, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు సిఇఒ ప్రదీప్ పి, సిపిఒ కెప్టెన్ ప్రవీణ్ ఖారా, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మనీష్ మెట్కర్‌కు రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలు, ప్రాజెక్టులను వివరించారు. ప్రత్యేకమైన విధానంలో రాష్ట్రంలో మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను ల్యాండ్ లార్డ్ మోడల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యాన ఎపి మారిటైమ్ బోర్డు అభివృద్ధి చేస్తున్న విధానాన్ని నితేష్ రాణే ప్రశంసించారు. కోస్తా తీరం లేని తెలంగాణ, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల ఎగుమతులు, దిగుమతులకు రాష్ట్రంలోని పోర్టులు కీలకంగా మారుతున్నాయని మంత్రి జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్‌కు మహారాష్ట్రకు చెందిన మజగాన్ డాక్ యార్డ్, మచిలీపట్నంలో షిప్ బిల్డింగ్‌కు గోవా షిప్ యార్డులు యాంకరేజ్ చేయడానికి ఎంఒయు కుదుర్చుకోగా, కాకినాడలో షిప్ బిల్డింగ్‌కు సంబంధించిన ప్రతిపాదన పురోగతిలో ఉందని వివరించారు. భవిష్యత్తు మారిటైమ్ మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన భూమిని ముందుగానే అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర తీర ప్రాంతంలో ఉన్న సుమారు 20 వేల ఎకరాల ఉప్పు భూములను ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డుకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)