- ప్రతి ఇంటా 'నెట్ జీరో' అమలు చేయాలి
- అంగన్‌వాడీలు, పారిశుధ్య కార్మికులకు 'తల్లికి వందనం`
- స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- 'అమృత్-2`లో రూ.15,274.21 కోట్ల పనులకు శంకుస్థాపన
- వర్చువల్‌గా నెల్లూరు, గుంటూరు నగరపాలక సంస్థల్లో ఇ-ఆటోలు ప్రారంభం
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌ను చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఇందులో భాగంగా అక్టోబర్ రెండు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా డంపింగ్ యార్డులను పూర్తిగా చెత్త రహితంగా మారుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి చెత్త బయటకు రాకుండా 'నెట్ జీరో' విధానాన్ని అమలు చేయాలని, గ్రామాలు, పట్టణాలు, పాఠశాలల్లోనూ దీనిని విస్తరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం నిర్వహించిన 'స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఎన్‌టిఆర్ స్టేడియంలో అమృత్ 2.0, యుఐడిఎఫ్ పథకాల కింద రూ.15,274.21 కోట్ల విలువైన 514 మున్సిపల్, ప్రజారోగ్య ఇంజనీరింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. నెల్లూరు, గుంటూరు నగరాల్లో 126 ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 108 సమగ్ర ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాల కోసం రూ.508 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇప్పటికే ఎనిమిది కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఎనిమిది వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తుండగా, మరో ఆరు బయోవేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు సిద్ధమవుతున్నాయని వివరించారు. ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తతో కంపోస్టు, పొడి చెత్తతో రీసైక్లింగ్, విద్యుదుత్పత్తికి వినియోగించాలని సూచించారు. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన 140 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని తెలిపారు. మిగిలిన చెత్తను అక్టోబర్ రెండు నాటికి పూర్తిగా తొలగిస్తామన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా పట్టణాలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామన్నారు. ఆగస్టు 26 నాటికి మున్సిపాలిటీల్లో 1,140 ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి వస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో 10,870 ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తున్నామని, చెత్తకు తీసుకొని దీనికి బదులుగా ఇప్పటికే రూ.16 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు ప్రజలకు అందించామని వివరించారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు, మండలాలకు గ్రేడింగ్ విధానం అమలు చేసి పోటీతత్వాన్ని పెంపొందిస్తామన్నారు. 'తల్లికి వందనం' నగదును రాష్ట్రంలోని 67.47 లక్షల మంది లబ్ధిదారులకు రూ.10,122 కోట్లను ఈ నెల 22, 23, 24 తేదీల్లో జమచేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలను, పారిశుధ్య కార్మికులను కూడా తొలిసారిగా ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చినట్లు తెలిపారు. వారి ఖాతాల్లో కూడా నగదు జమచేస్తామని ప్రకటించారు. రాష్ర్టాభివృద్ధి ద్వారా ఆదాయం పెరిగితేనే సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించగలమన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించి వ్యవసాయాన్ని కాపాడగలిగామని, 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. వంశధార నుంచి పెన్నా వరకు నదులను అనుసంధానం చేసి కరువు రహిత ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, ఎంపి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, జిల్లా కలెక్టర్ డికె బాలాజీ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)