ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరంకుశ శాసనాలు, నీతి బాహ్య విన్యాసాలు

5 గంటల క్రితం

bjp govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 05:45 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

జులై 20 సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు కొత్త చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇటీవల శాసనసభల ఎన్నికలలో గెలిచి ప్రాంతీయ పార్టీలను చీల్చి బలోపేతంగా తయారైనామని టముకు వేసుకున్న బిజెపి-ఎన్‌‌డిఎ నేతలు ఆ ధీమాతో దూసుకెళ్లడం గాక రకరకాల మల్లగుల్లాలు పడుతున్న తీరు మేడిపండు చందంగా వుంది. ఈ సమావేశాలలో ఏయే బిల్లులు వస్తాయనే దానిపైనే భిన్న కథనాలు అధికారికంగానే లీకవుతున్నాయి. ప్రతిపక్ష శిబిరాన్ని చీల్చడం గురించి వారు చెబుతుంటే ఎన్‌‌డిఎ భాగస్వామ్య పక్షాలు కూడా ఆమోదించలేని కొన్ని అంశాలు బయిటకు వస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్‌ ‌సింగ్‌ ‌నాయకత్వంలో జరిగిన ఎన్‌‌డిఎ సమావేశం తర్వాత కూడా సాధికారికంగా సమ్రగమైన ప్రకటన ఏదీ రాలేదు. మంగళవారం నాడు ప్రధాని మోడీ సమక్షంలో జరిగే పార్లమెంటరీ సమావేశం తర్వాతనే అసలైన ఎజెండా వస్తుందని ఇప్పుడంటున్నారు. ఈ లోగా షరామామూలుగా ప్రతిపక్షాలపై దాడి కొనసాగిస్తూనే వున్నారు. దానికి తగినట్టే గతంలో ‘ఇండియా’ వేదికలో కీలక భాగస్వాములుగా మెలిగిన పార్టీలే ఇప్పుడు తలో విధంగా మాట్లాడుతూ ఆచరణలో ఏం చేయబోతున్నాయనే దానిపై అనుమానాలు పెంచుతున్నాయి. మొదటి సమాచారం ప్రకారమైతే అయిదు బిల్లులు సభ ముందుకు తీసుకువస్తామని పాలక కూటమి సూచించింది. అవి గాక మరో మూడు బిల్లులు కూడా తర్వాత జోడించింది. ఒకటి: ఆదాయపు పన్ను సవరణ బిల్లు-2026. గ‌ల్ఫు యుద్ధం కారణంగా పెట్టుబడులను ఆకర్షించేందుకోసం బయిటి నుంచి వచ్చేవారి ఆదాయాల మీద పన్నును మినహాయిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌‌కు శాసన రూపం. రెండు:పెండింగు కేసుల భారం రీత్యా సత్వర న్యాయం కోసం స్రుపీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపుదల బిల్లు. మూడు: జనన మరణాల నమోదులో ఆలస్యాన్ని నివారించే కఠిన చర్యల కోసం బిల్లు. నాలుగు: జాతీయ స్మారకాల అవమానాన్ని నిరోధించే బిల్లు పేరిట వందేమాతరం పాడకపోతే శిక్షతో పాటు ఆ పాటలో గతంలో నిషేధించిన చరణాలను కూడా చేర్చడం. అయిదు: సులభతర వాణిజ్య ప్రోత్సాహంలో భాగంగా కొన్ని రకాలైన తనిఖీలను స్థానిక కేంద్రాలకు అప్పగింత. వీటితో పాటు విదేశీ విరాళాల స్వీకారం నియంత్రణ కోసం మరో రెండు చట్టాలను కట్టుదిట్టం చేయడమనే వివాదాస్పద శాసనం, వికసిత్‌ ‌భారత్‌ ‌శిక్షా అధిష్టాన్‌ ‌బిల్లు.

కీలకాంశాల దాటవేత

ఈ జాబితాలోవే గాక ఇంకా మరికొన్ని రావచ్చని సూచనలు ఇస్తున్నారు గానీ రాజకీయంగా, రాజ్యాంగ పరంగా అతి కీలకమైన మరో రెండు బిల్లులపై బిజెపి నేతలు మౌనం పాటిస్తున్నారు. లేదంటే భిన్నమైన సూచనలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్‌‌తో ముడిపెట్టి నియోజకవర్గాల పునర్విభజన పేర 543 స్థానాలను 850కి పెంచే బిల్లు. లోక్‌‌సభ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని చెప్పే జమిలి బిల్లు. రాజకీయంగా అమిత ప్రాధాన్యత గల ఈ రెండు శాసనాల గురించి ఎందుకు చెప్పడం లేదనేది ఒకటైతే, వాటిని హఠాత్తుగా తీసుకొచ్చి ఆమోదించేసుకుంటారా అనే సందేహాలు కూడా బలంగానే వున్నాయి. వాటి మీద రాజకీయంగా బయిట చర్చలు, వివాదాలు నడుస్తున్నాయిగానీ పారదర్శకంగా కేంద్రం ప్రకటన చేయకుండా దాగుడు మూతలాడుతున్నది. అనేక కీలకమైన బిల్లులను ఆఖరి నిముషంలో అధాటున ప్రవేశపెట్టి ‘మమ’ అనిపించుకున్న వ్యూహం ఇప్పుడు కూడా అమలవుతుందనే అనుమానాలున్నాయి.​ నెల రోజులు జైలులో వుంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహా ఏ పదవికైనా అనర్హత కలిగించే అతి నిరంకుశమైన 131వ రాజ్యాంగ సవరణ కూడా ఇప్పుడు రాదంటున్నారు.

ఉదాహరణకు జమిలి ఎన్నికలు లేదా ఒకే దేశం ఒకే ఎన్నిక (ఒ.ఎన్‌-ఒ.ఇ) అధ్యయనం కోసం నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) చైర్మన్‌ ‌పి.పి.చౌదరి మాట్లాడుతూ 2029లోనే ఇది జరిగే అవకాశముందన్నారు. తాము అభిప్రాయాలు అడిగిన వారిలో 99 శాతం స్పందించారనీ, ముఖ్యమంత్రులతోనూ మాట్లాడామని చెప్పారు. త్వరగా ముగించి ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్‌ ‌మాజీ రాష్ర్టపతి రామ్‌‌నాథ్‌ ‌కోవింద్‌‌కు సమర్పిస్తామని తర్వాత ఎప్పుడైనా నివేదిక వెలువడవచ్చని వెల్లడించారు. మోడీ విజన్‌ ప్రకారమే ఈ జమిలి చర్చ వచ్చిందని, చీటికీ మాటికీ ఎన్నికల వల్ల వచ్చే అస్థిరత్వం అడ్డుకోవచ్చని, దీనివల్ల రూ.7 లక్షల కోట్లు ఆదా అవుతాయని ఏదో లెక్క చెబుతున్నారు. చర్చ ఇప్పుడు జరిగినా 2034లో గానీ జమిలి వుండదని గతంలో హామీ ఇస్తూ వచ్చిన బిజెపి నాయకత్వం ఎందుకుని హఠాత్తుగా మాట మార్చింది? ఇదే సమయంలో సీట్ల సంఖ్య పెంపు కూడా అనివార్యంగా చేస్తామని సంకేతాలు వదులుతున్నది. తమకు అవసరమైన మద్దతు వుందని మంత్రి రామ్‌దాస్‌ అథవాలే చెప్పనే చెప్పారు.​

2026 ఏప్రిల్‌ ‌నెలలో సభలో ప్రవేశపెట్టి వెనక్కు తీసుకున్న బిల్లుపై మళ్లీ హడావుడి పడటానికి కారణాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇటీవలి శాసనసభ విజయాల తర్వాత రాజ్యసభలో బిజెపి బలం పెరిగింది. ఇక లోక్‌‌సభ విషయానికి వస్తే ఓటమి పాలైన అనేక ప్రాంతీయ పాలక పార్టీల నేతలు జెండా ఎత్తేసి బిజెపి తో చేతులు కలపడానికి సిద్ధమైపోయారు. అప్పటి అగ్గి బరాటా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు గాలితీసిన బెలూన్‌‌లా అయిపోగా ఆమె వందిమాగధులైన 20 మంది ఎం‌పీలు నేషనలిస్ట్‌ ‌ సిటిజన్స్ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.సి.పి.ఐ)లో చేరడానికి అనుమతి కోరుతున్నారు. శివసేన ఉద్ధవ్‌ ‌ధాకరే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌‌నాథ్‌ ‌షిండే వర్గంలో చేరిపోవచ్చంటున్నారు. శరద్‌ ‌పవార్‌ ఎన్‌‌.సి.పి కి చెందిన ఎనిమిది మంది సభ్యులు కూడా సానుకూల సంకేతాలు పంపుతున్నారు. పవార్‌ కుమార్తె, పార్టీ ఎంపీ సుప్రియా సూలే అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా సీట్లు పెంచితే బలపర్చడానికి అభ్యంతరమేమిటని సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. 22 స్థానాలున్న డి.ఎం.కె కూడా అటూ ఇటూ మాట్లాడుతూ బలపర్చేలా సూచనలు వదులుతున్నది. వైసిపి ఎంపీలు నలుగురు కూడా ఏదో విధంగా అనుకూల పాత్ర నిర్వహిస్తారనే అంచనా వుంది. ఇక ఎన్‌‌సిపి, శివసేనల మద్దతుతోనే 319కి చేరిన ఎన్‌‌డిఎ కి వున్న 299 బలానికి ఇవి కూడా తోడైతే పరిస్థితి మారుతుంది. ఇందుకోసం లోలోపల మంతనాలు, బేరసారాలు సాగుతున్నాయనేది అందరికీ తెలుసు. పునర్విభజన లేదా ఎ.పి పునర్విభజన చట్టం కింద ఏదో ఒక విధంగా సీట్ల సంఖ్య పెరుగుతుందని బి.ఆర్‌.ఎస్‌ అధినేతలు కూడా ఈ మధ్యనే ప్రకటించారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజార్టీ వస్తే లోక్‌‌సభ స్థానాలు 543 నుంచి 850కి చేరతాయి. ఈ సంఖ్య పెంపు కోసం నియోజకవర్గాల జనాభా పొందిక కూడా పూర్తిగా మారిపోవచ్చు. మతాల వారీగా ఓటర్లను ఒక చోటికి చేర్చే పథకం సాగుతున్నదని కూడా బలమైన సంకేతాలున్నాయి. ‘సర్‌’ ‌పేరిట కోట్ల ఓట్ల తొలగింపు, పౌరసత్వ ప్రక్షాళన పేరిట విదేశీయుల తొలగింపు ప్రహసనం కూడా ఇందుకు తోడవుతున్నది. ఈ సమావేశాలలో తీసుకొస్తున్న జనన మరణాల బిల్లులో కూడా ఇదే వ్యూహం వుంది.

అంతర్గత అలజడి

ఇతర పార్టీల నుంచి చేర్చుకుని కృత్రిమంగా సంఖ్యా బలం పెంచుకునే ప్రయత్నాలు ఒకవైపున జరుగుతుంటే, కూటమిలో వున్న వారే జీర్ణించుకోలేని నిర్ణయాలు మరోవైపున నిరసనలకు దారితీస్తున్నాయి. మొదట పేర్కొన్న జాబితాలోని వికసిత్‌ ‌భారత్‌ ‌శిక్షా అధిష్టాన్‌ ‌(‌వి.బి.ఎస్‌.ఎ) ‌బిల్లు ఉమ్మడి జాబితాలోని విద్యా రంగాన్ని పూర్తిగా కేంద్రం చేతుల్లో పెడుతున్నది. దీనికి రాష్ట్రాలు, ప్రైవేటు కార్పొరేట్‌ ‌రంగం కూడా అభ్యంతరం చెబుతున్నాయి. అన్ని వేళలా విధేయత చాటే ఆంధ్ర్రపదేశ్‌ ప్రభుత్వం కూడా అనంగీకరం చెబుతున్నది. ఇందులోని 45వ క్లాజు ప్రకారం రాష్ట్రాలు చేసే బిల్లులపై రాష్ర్టపతి మాటే అంతిమం. యుజిసి, ఎఐసిటిఇ వంటి సంస్థలన్నీ విఫలమై పోయాయని కేంద్రం చెబుతున్నది. ఈ ప్రకారం అంతిమ వాక్యం కేంద్రం చేతుల్లో పెడితే ఉన్న కాసిన్ని హక్కులు కూడా హరించుకుపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా దేశంలో భాషా సాంస్కృతిక వైవిధ్యానికీ ముప్పు ఏర్పడుతుంది. ఇప్పటికే తప్పని సరిగా త్రిభాషలు నేర్చుకోవాలన్న విధానం మంట పుట్టిస్తున్నది. దీనిపై ఈ మధ్యనే సుప్రీం కోర్టు కూడా అభ్యంతరం చెప్పింది. ఇంగ్లీషును కూడా మాతృభాషతో పాటు లెక్కలోకి తీసుకోవాలిగానీ మూడో భాష అంటూ ఒత్తిడి చేయొద్దని ఆ దేశించింది. కానీ విద్యా రంగాన్ని పూర్తిగా గుప్పిట్లోకి తెచ్చుకుంటున్న ఆర్‌‌.ఎస్‌.ఎస్‌, ‌సంఘ పరివార్‌‌లు అందుకు సిద్ధంగా లేవు. ఆఘమేఘాల మీద దానిపై కేంద్రానికి పెత్తనం ఇచ్చేయాలంటున్నాయి.

నీట్‌‌, ఇరాన్‌‌పై దుర్రాకమణ

ఆసక్తికరమైన విషయమేమంటే విద్యపై ఇంత హంగామా చేస్తున్న కేంద్రం ‘నీట్‌’ ‌అవినీతికి కారకుడైన మంతి ధర్మేంద్ర ప్రధాన్‌‌ను రాజీనామా చేయించేందుకు సిద్ధం కాలేదు. ‘నీట్‌‌’తో పాటు ఇరాన్‌‌పై అమెరికా దుర్రాకమణ, ఇండియాపై వివక్ష వంటి విషయాలలోనూ మోడీ వ్యవహరించిన తీరు త్రీవ విమర్శలకు గురైంది. మన విదేశాంగ విధానం కూడా విమర్శల పాలైంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయనతో పాటు మరికొందరిని కూడా తప్పిస్తారని ఊహాగానాలు వున్నా ఏం జరిగేది ప్రత్యక్షంగానే చూడాలి. పదవీ కాలం సగం కాగానే వచ్చే ఎన్నికలకు సిద్ధమై పోవడం బిజెపి కి రివాజు గనక ఈ సమావేశాలు, ఈ మంత్రుల మార్పులు కూడా వచ్చే ఎన్నికలకు ముందస్తు సూచికలవుతాయి. కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా జయప్రదం కాకపోగా కొన్ని కొత్త సమస్యలు కూడా సృష్టిస్తున్న మాట యదార్థం. అయినా ఈ సమావేశాల్లో మోడీ సర్కారు నిరంకుశ పోకడలకు, శాసనాలకు ఏకోన్ముఖంగా పగ్గాలు వేయాలనే అవగాహనకు లౌకిక పార్టీలు వస్తున్నాయి.


- తెలకపల్లి రవి​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్