ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

లౌకికవాద ఆవరణపై దాడి

5 గంటల క్రితం

1991 act
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

(నిన్నటి సంచిక తరువాయి)

ఇంకొక రంగం ఉంది, ఇది అత్యంత బహిరంగంగా సంస్కృతికి సంబంధించినది, రాజ్యాంగ వ్యవస్థ దీర్ఘకాలిక మనుగడకు అత్యంత ప్రమాదకరమైనది. ‘ఆరాధనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991’ పార్లమెంటుకు చట్టబద్ధమైన రక్షణ గోడగా పని చేసింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఏ ఆరాధనా స్థలం మార్పిడినైనా నిషేధించడం, అలాగే 1947 ఆగస్టు 15న ఉన్నట్లుగానే ప్రతి ఆరాధనా స్థలం మతపరమైన స్వభావాన్ని కొనసాగించడం. ఈ చట్టం శతాబ్దాల వివాదాస్పద చరిత్రకు ముగింపు పలికింది. భారతదేశం గతాన్ని తిరిగి వివాదాల్లోకి లాగబోదన్న హామీగా నిలిచింది. దీనికి ఏకైక మినహాయింపు రామ జన్మభూమి. బాబ్రీ మసీదు కూల్చివేత మిగిల్చిన గాయాల తర్వాత, ఈ 1991 చట్టం భవిష్యత్తులో మరిన్ని అయోధ్యలు ఉండబోవని పార్లమెంటు సాక్షిగా చేసిన విధాన ప్రకటనగా మనం చూడాలి.

కానీ ఈ ప్రకటనపై కొంత కాలంగా తీవ్రమైన దాడి జరుగుతోంది. 2026 మేలో, మధ్యప్రదేశ్ హైకోర్టు ధార్‌ లోని భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్ చారిత్రకంగా హిందూ దేవాలయమని తీర్పు ఇచ్చింది. ఈ కాంప్లెక్స్ శతాబ్దాలుగా మసీదుగా పనిచేస్తోంది. 2003 నుండి శుక్రవారాల్లో ముస్లిం ప్రార్థనలు, మంగళవారాల్లో హిందూ పూజలకు అనుమతించే ఏర్పాటు ఉంది. ముస్లింలు జిల్లాలో మరెక్కడైనా ప్రభుత్వం నుండి ప్రత్యామ్నాయ భూమిని పొందవచ్చని కోర్టు సూచించింది. చారిత్రక ఫిర్యాదు, ఎ.ఎస్.ఐ సర్వే, న్యాయ నిర్ణయం, ఆస్తి కోల్పోవడం వంటి అంశాల చుట్టూ అల్లిన అయోధ్య తరహా తర్కమే ఇక్కడా వర్తింపజేశారు.

ఆరాధనా స్థల "మతపరమైన స్వభావాన్ని గుర్తించడం" 1991 చట్టం ద్వారా నిషేధించబడలేదని, కేవలం మార్పిడి మాత్రమే నిషేధించబడిందని 2022లో జ్ఞానవాపి విచారణల సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యానం దేశవ్యాప్తంగా ఉన్న మసీదులను లక్ష్యంగా చేసుకుని పిటిషన్ల వరదకు దారితీసింది. ఆచరణలో, "గుర్తించడం" , "మార్చడం" పదాల మధ్య వ్యత్యాసం భ్రమగా నిలిచింది. న్యాయపరమైన వ్యాఖ్యానం సర్వేలను ప్రారంభిస్తుంది, సర్వేలు కొన్ని ఆధారాలను సృష్టిస్తాయి, ఆధారాలు వ్యాజ్యానికి దారితీస్తాయి, వ్యాజ్యం ప్రజల సమీకరణకు కారణమవుతుంది, అంతిమంగా ఈ సమీకరణ తరతరాల జీవితాలను గాయపరిచే హింసకు దారితీస్తుంది. ఇటువంటి సర్వేలు అంతిమంగా ఎక్కడికి దారితీస్తాయో చెప్పడానికి నవంబర్ 2024 నాటి సంభాల్ హత్యలను ఉదాహరణగా పేర్కొనవచ్చు.

​ ఆర్‌.ఎస్‌.ఎస్-బిజెపి ప్రాజెక్టుకు ఎన్నికల వనరుగా మతపరమైన ధ్రువీకరణను కొనసాగించడానికి నిరంతరం ఇలాంటి "వివాదాలు" అవసరం. 1991 చట్టం ఈ ధ్రువీకరణకు అడ్డుగా నిలిచింది. ఇటువంటి చట్టాన్ని శాసనసభ ద్వారా రద్దు చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే న్యాయపరమైన వ్యాఖ్యానాలు, పరిపాలనా సర్వేలు, చట్ట రక్షణను నిరుపయోగంగా మార్చే పూర్వదర్శనాల ద్వారా దీనిపై దాడి జరుగుతోంది.

వీటన్నింటినీ కలిపి చదివినప్పుడు, ఇదంతా ఒక స్పష్టమైన ప్రణాళిక అని అర్థమవుతుంది.

నియోజకవర్గాల పునర్విభజన, బిజెపికి ప్రధాన పట్టుగా ఉన్న రాష్ట్రాలకు అనుకూలంగా పార్లమెంటులోని సంఖ్యాబల సమీకరణాలను పునర్వ్యవస్థీకరిస్తుంది. ‘సర్’ అనేది పేదలు, వలసదారులు, ముస్లింలు, దళితులతో సహా బిజెపి కి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉన్న వారిని ఓటర్ల జాబితాల నుండి తొలగిస్తుంది. సి.ఎ.ఎ మతపరమైన వర్గీకరణకు ఒక దొడ్డిదారిని అందిస్తుంది. అన్నపూర్ణ పథకంలో ఉపయోగించిన నమూనా ప్రజల హక్కుల ప్రయోజనాలను పౌరసత్వ ధ్రువీకరణతో ముడిపెడుతుంది. ప్రభుత్వ మద్దతును గుర్తింపు నిరూపణకు షరతుగా మారుస్తుంది. 1991 చట్టంపై దాడి మనువాద-హిందుత్వ కూటమిని కలిపి ఉంచే మతపరమైన ఉద్రిక్తతను సృష్టిస్తుంది. వీటన్నిటినీ అడ్డుకోవాల్సిన రాజ్యాంగ సంస్థలు ఇప్పటికే క్రమపద్ధతిలో రాజీ పడ్డాయని మనం ఈ విశ్లేషణ మొదటి భాగంలో చూశాము.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, వీటిని విడివిడిగా చూసినప్పుడు ప్రతి ఒక్కటీ ప్రక్రియల పరంగా సమర్థనీయంగా అనిపిస్తుంది. ‘సర్’ అనేది ఓటర్ల జాబితా కచ్చితత్వానికి సంబంధించినది. నియోజకవర్గాల పునర్విభజన ఒక రాజ్యాంగ అవసరం. భోజ్‌శాల తీర్పు ఒక కోర్టు తీర్పు. ఒక అధికారిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ నిరంకుశ ఏకీకరణ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. ఇది ప్రక్రియల పరంగా లభించే చట్టబద్ధతల ద్వారా జరుగుతుంది. ఇవి మొత్తంగా చూసినప్పుడు మనల్ని పాలిస్తున్న నయా-ఫాసిస్టు శక్తులకు ఒక అనుకూలమైన మార్పును అందిస్తాయి.

మళ్లీ మార్క్స్ - ఎంగెల్స్ మాటల్లో చెప్పాలంటే, ఆధునిక దేశ కార్యనిర్వాహక వర్గం మొత్తం బూర్జువా వర్గ ఉమ్మడి వ్యవహారాలను నిర్వహించే ఒక కమిటీ. నేటి భారతదేశంలో, ఆ కమిటీ పెట్టుబడి యొక్క నిర్దిష్ట వర్గ వ్యవహారాలను నిర్వహించడమే కాకుండా... దేశాన్ని రాజకీయంగా, భౌగోళికంగా, జనాభాపరంగా, పౌరసత్వం ఆధారంగా, ఆరాధనా స్థలాలు, వాటి రాజ్యాంగపరమైన గుర్తింపుతో సహా అన్నింటినీ మార్చడానికి పూనుకుంది. దీనికి వ్యతిరేకంగానే సిపిఎం ఇతర వామపక్షాలు పోరాడుతున్నాయి. కార్మిక వర్గం, రైతాంగం, గ్రామీణ-పట్టణ పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు (భాష, మత, లైంగిక), మహిళలు, విద్యార్థులు, యువత, ఇతర ప్రజాస్వామ్య శక్తులు ఇంకా సంఘటితం కావడానికి, ఉద్యమించడానికి, చరిత్ర గమనాన్ని మార్చడానికి వీలు కల్పించే రాజ్యాంగ చట్రాన్ని రక్షించడం కోసమే మేము పోరాడుతున్నాము.

హిందుత్వకు వ్యతిరేకమైన పోరాటాన్ని కుల వ్యతిరేక పోరాటం నుండి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జరిగే విస్తృత పోరాటం నుండి వేరు చేయలేమని మనం మర్చిపోకూడదు. ఈ పోరాటాలను సాంస్కృతిక రంగాలలోకి కూడా తీసుకెళ్లాలి. ఎందుకంటే హిందుత్వ ఫాసిస్టు శక్తులు తమ నిజ స్వరూపాన్ని దాచుకోవడానికి సాంస్కృతిక ముసుగులను క్రమపద్ధతిలో ఉపయోగిస్తాయి. ఈ అవగాహనే లోపభూయిష్ట మైన యథాతథ స్థితిని తిరిగి స్థాపించడంతోనే సంతృప్తి చెందే మన ఉదారవాద మిత్రుల నుండి మనల్ని వేరు చేస్తుంది. ఇది అర్థం చేసుకోలేక పోతే సమాజంలో మార్పునకు అవకాశాన్ని (అంటే ఖచ్చితమైన రూపాంతర రాజకీయాలకు ఉన్న అవకాశాలను) మనం చేజార్చుకునే ప్రమాదం ఉన్నది. దానికి మనం ఆస్కారం ఇవ్వకూడదు.


- వ్యాసకర్త: ఎం.ఏ. బేబీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్