ప్రస్తుతం దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వాలకు కనీస జవాబుదారీతనం లేదు. ఇప్పటివరకూ ప్రత్యామ్నాయ భావజాలంపైనా, వాటిని వ్యాప్తి చేస్తున్న సంస్థలపైన, వారి వ్యక్తిగత జీవితాలపైనా దుష్ప్రచారం చేస్తున్న మతోన్మాద శక్తులు… ఇప్పుడు కొత్తగా భౌతిక దాడులకు, ప్రముఖుల స్మారక స్థూపాల విధ్వంసానికి పాల్పడుతున్నారు. సమాజానికి విజ్ఞానం, హేతువాదం, ప్రగతిశీల ఆలోచనలను అందించిన మహనీయుల వ్రిగహాలపై దాడులు చేయడం ప్రజాస్వామిక, సాంస్కృతిక విలువలపై దాడి చేయడమే. భావజాల భేదాలను హింస, విధ్వంసాల ద్వారా వ్యక్తపరచడం ఏ ప్రజాస్వామ్య సమాజంలోనూ ఆమోదయోగ్యం కాదు. ‘భిన్నాభిప్రాయాలను గౌరవించినప్పుడే స్వేచ్ఛ సజీవంగా ఉంటుంది’ అంటారు రవీంద్రనాథ్ టాగూర్. ఒక విగ్రహాన్ని కూల్చవచ్చు... ఒక పుస్తకాన్ని తగలబెట్టవచ్చు... ఒక పేరును చరిత్ర పుటల నుంచి చెరిపేయాలని ప్రయత్నించవచ్చు. కానీ ఆ మహనీయులు వెలిగించిన ఆలోచనలను, సమాజంలో పెంపొందించిన చైతన్యాన్ని, ప్రజల హృదయాల్లో మొలకెత్తే ప్రశ్నలను ఏ శక్తీ అంతం చేయలేదు. పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహ ధ్వంసం అలాంటి భయాన్ని మరోసారి మన ముందుంచింది. ఇది ఒక శిల్పంపై జరిగిన దాడి మాత్రమే కాదు; భిన్న ఆలోచనలను, అభ్యుదయ సంప్రదాయాలను, చరిత్ర జ్ఞాపకాలను చెరిపివేయాలనే ప్రమాదకర ధోరణికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో భావాలతో తలపడాల్సిన చోట, విగ్రహాలతో యుద్ధం చేయడం… వారి మానసిక బానిసత్వానికి నిదర్శనం.
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా రాణిగంజ్‌లో మొన్నటి దాకా ఉండిన తొమ్మిది అడుగుల రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహ విధ్వంసం హిందుత్వ అజ్ఞానానికి పరాకాష్ఠ. ఇది కేవలం ఒక విగ్రహంపై జరిగిన దాడి కాదు... భారత మేధో సంపదపై, అభ్యుదయ ఆలోచనలపై, చరిత్ర జ్ఞాపకాలపై జరిగిన దాడి. మూడు దశాబ్దాలుగా కార్మిక ఉద్యమాలకు, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచిన ఆ విగ్రహాన్ని చీకటిలో కూల్చివేయడం అంటే- బలమైన బొగ్గు గనుల కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడానికి, తూర్పు బొగ్గు క్షేత్రాలను భారతదేశంలో కొత్తగా పుట్టుకొచ్చిన ఇంధన దిగ్గజాలకు అప్పగించి ప్రైవేటీకరించడానికి జరుగుతున్న కాషాయ ప్రభంజనంలో మరొక అంకం. ముఖ్యంగా హిందీ ప్రాంతంలో, అక్కడి యువ పాఠకులు ఇప్పటికీ ఆయన రచనల ద్వారా స్ఫూర్తి పొందుతున్నారు. రాహుల్ స్థానంలో రాముడిని ప్రతిష్ఠించడం ద్వారా, రాబోయే కాలమంతా ప్రగతిశీల భావజాలాన్ని అంతం చేయాలన్న ఒక నిస్పృహతో కూడిన ప్రయత్నం జరుగుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే ముర్షిదాబాద్‌లో లెనిన్ విగ్రహంపై దాడి జరిగింది. మెడలో కాషాయ టవల్ వేలాడదీసి 'జై శ్రీరామ్' నినాదాలు చేస్తూ లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. మతోన్మాద రాజకీయ హిందుత్వ కాంట్రాక్టర్లు రాష్ట్రంలో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత గత రెండు నెలల్లో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ మార్గదర్శకులపై ఇలాంటి దాడులు జరిగాయి. త్రిపురలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లెనిన్ విగ్రహాన్ని ఈ విధంగానే ధ్వంసం చేశారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర మితవాద రాజకీయ సిద్ధాంతాలు, ఫాసిస్టు భావజాలాలను అనుసరించే రాజకీయ పార్టీలు లెనిన్‌ను సహించలేవు. విగ్రహాలను పగలగొట్టడం ద్వారా వామపక్షవాదం, సోషలిస్టు భావాలను తుడిచివేయలేరని మూర్ఖులకు అర్థం కాదు._
చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే... భావాలను ఓడించడంలో బలప్రయోగం ఎన్నడూ విజయం సాధించలేదు. సోక్రటీస్‌కు విషం ఇచ్చారు; ఆయన ప్రశ్నించే తత్వాన్ని కాదు. గెలీలియోను మౌనం చేయాలని చూశారు; సత్యాన్ని కాదు. భగత్‌సింగ్‌ను ఉరి తీశారు; స్వాతంత్ర్య కాంక్షను కాదు. గాంధీని హత్య చేశారు; అహింసను కాదు. అంబేద్కర్‌పై విమర్శలు వచ్చాయి; రాజ్యాంగ విలువలను మాత్రం ఎవరూ చెరిపేయలేకపోయారు. రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండవచ్చు; కానీ ఆయన వెలిగించిన హేతువాదాన్ని, విజ్ఞాన దృక్పథాన్ని, సమానత్వ స్వప్నాన్ని ఎవరూ ధ్వంసం చేయలేరు. చరిత్రను చెరిపేయాలని చేసే ప్రతి ప్రయత్నం… చివరికి చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుంది. విగ్రహాలు రాళ్లతో నిర్మితమవుతాయి. కానీ మహనీయుల ఆలోచనలు ప్రజల మనసుల్లో నిర్మితమవుతాయి. రాళ్లను పగలగొట్టవచ్చు; ఆలోచనలను కాదు. ‘చరిత్రను మరిచిపోయిన జాతి... భవిష్యత్తును నిర్మించుకోలేదు’ అంటారు జవహర్‌లాల్ నెహ్రూ. భావజాలాల మధ్య పోటీ ఉండొచ్చు; కానీ మనకు నచ్చని భావజాలాన్ని ఎదుర్కోవడానికి మార్గం విగ్రహాలను కూల్చడం కాదు; వాదనలతో, చర్చలతో సమాధానం చెప్పడం. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చీకటి సంకేతాలను, చరిత్రను మసకబార్చే ప్రయత్నాలను ఎన్నటికీ సహించకూడదు.








కామెంట్‌లు (0)