గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకుట్రపూరితంగా అప్పలరాజును ఇరికించారు

1 గంట క్రితం

jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 11:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

  • సమయం దాటిపోవడంతో ములాఖత్ రద్దు

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలపై చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డి విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌కు గురువారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాద కేసును హత్య కేసుగా మార్చి మత్స్యకార సామాజిక తరగతికి చెందిన మాజీ మంత్రి అప్పలరాజును కుట్రపూరితంగా కేసులో ఇరికించి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. అనుకోకుండా సంభవించిన ప్రమాదంలో 18 ఏళ్ల పిల్లాడిపై హత్య కేసు పెట్టి కెరీర్ నాశనం చేయాలని చూడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. టిడిపి నాయకుల వాహనాలు ఢీకొని చనిపోయిన ఘటనల్లో వారిపై ఇలానే కేసులు పెడుతున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను, సూపర్ సిక్స్‌ను గాలికొదిలేసి, వాటిని ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. బిసిలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప వారిపై చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. గత ప్రభుత్వంలో మత్స్యకారుల కోసం పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిషింగ్ లాండింగ్‌ సెంటర్లు ప్రారంభిస్తే స్కామ్‌లు చేసి అమ్మకానికి పెట్టారని ఆరోపించారు.

ములాఖత్ రద్దు

అంపోలు జైలులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌‌మోహన్ రెడ్డి ములాఖత్ సాధ్యపడలేదు. జైలు నిబంధనల ప్రకారం ఐదు గంటల్లోపు ములాఖత్ కావాల్సి ఉంది. జైలు ప్రాంగణానికి జగన్‌ చేరుకునే సరికి 5.12 గంటలైంది. ములాఖత్ కోసం జైలర్‌ను కోరగా, ఆయన ఉన్నతాధికారులను సంప్రదించారు. నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని వారు స్పష్టం చేయడంతో అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన అప్పలరాజు భార్య శ్రీదేవి, కుమారులను పరామర్శించి, వారితో 15 నిమిషాలు మాట్లాడారు.

వైసిపి కార్యకర్తలపై లాఠీచార్జి

‌జగన్‌ పర్యటన నేపథ్యంలో పరామర్శకు తప్ప ర్యాలీలు, సభలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాన్వాయ్‌లో ఎనిమిది వాహనాలకే అనుమతి ఇచ్చింది. వైసిపి శ్రేణులు రాకుండా రహదారి పొడవునా ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో అంపోలుకు వెళ్లే దారిలో వంతెన వద్ద భారీగా చేరుకున్న వైసిపి కార్యకర్తలను పోలీసులు రోప్‌తో అడ్డుకోవడంతో ఆగ్రహంతో నెట్టుకుంటూ వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. కొత్త రోడ్డు వద్ద ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్, పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో బూర్జ ఎస్ఐ ప్రవ‌ల్లిక వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. రవికుమార్‌తో పాటు పలువురు వైసిపి నాయకులు ఆమెను చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆమెను కొందరు పక్కకు నెట్టేందుకు ప్రయత్నించగా, వారి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్