- ఇప్పటికే ఇరువురు అరెస్ట్.. మరో నలుగురి కోసం వేట
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని గత నెల 14న విజయవాడ - చెన్నై రైల్వే మార్గంలో అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దోపిడీ రాజస్థాన్ కు చెందిన భవారియా గ్యాంగ్ పనే అని గుంటూరు సర్కిల్ రైల్వే డిఎస్‌పి అక్కేశ్వరరావు చెప్పారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ముఖేష్ అలియాస్ లఖన్ ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం తెనాలి రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్‌పి వెల్లడించారు. తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్టు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుంది. అప్పికట్ల సమీపంలో రైలు వేగం తగ్గిందుకు ఈ గ్యాంగ్ ప్రయత్నించింది. ఆ తర్వాత ఎస్3, ఎస్6 భోగిలోకి మొత్తం ఆరుగురు ముఠా సభ్యులు చొరబడ్డారు. ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకున్నారు. ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు తీసుకునే సమయంలో ఆమె కేకలు వేయడంతో దుండగులు బయపడి ట్రైన్ చైన్ లాగారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా రాళ్లు, కత్తులతో పోలీసులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ముఠాలోని ఒకరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. రెండో నిందితుడు ముఖేష్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నలుగురు నిందితుల కోసం వేట కొనసాగుతోందని డిఎస్‌పి తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు నేరాలకు పాల్పడిన ఈ గ్యాంగ్‌పై కేసులు ఉన్నట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)