గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రజల కోసం..ప్రగతి కోసం కళలు

2 గంటల క్రితం

pnm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 12:01 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • డాక్టర్ భరత్

  • ప్రజా సమస్యల నుంచి కళలు ఉద్భవిస్తాయి : మాజీ ఎమ్మెల్యే గఫూర్‌

  • డప్పు మోగించి ప్రజానాట్యమండలి 11వ రాష్ర్ట మహాసభ ప్రచార భేరి

  • 25 నుంచి పిఎన్ఎం రాష్ట్ర మహాసభ

ప్రజాశక్తి - కర్నూలు క్రైమ్‌ : 'కళ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు. అది ప్రజల కోసం, ప్రగతి కోసం, మరియు సమాజ మార్పు కోసం’ అని ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ భరత్ అన్నారు. ప్రజానాట్యమండలి 11వ రాష్ట్ర మహాసభను పురస్కరించుకుని గురువారం కర్నూలులోని చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు వద్ద మహాసభ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే గఫూర్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, వర్తమాన అష్టావధాని డాక్టర్ హర్ష, ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు ఎండి. ఆనంద్ బాబు, గౌస్ దేశాయ్, రామకృష్ణ, రాముడులతో కలసి డాక్టర్ భరత్ ఢంకా (డప్పు) మోగించి ప్రచారాన్ని హోరెత్తించారు. భరత్ మాట్లాడుతూ... 'ప్రజానాట్యమండలి సహకారంతో ఎన్నో ఉద్యమాలు విజయాలు సాధించాయి. పెద్ద పెద్ద రాజకీయ కుట్రలను కూడా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో, వైవిధ్యభరితమైన కళారూపాల ద్వారా ప్రజానాట్యమండలి చైతన్యపరుస్తోంది’ అని కొనియాడారు. గఫూర్ మాట్లాడుతూ.... కళలు కమర్షియలైజేషన్ గా మారుతున్న తరుణంలో ప్రజా కళలకు, కళాకారులకు ఆదరణ తగ్గిపోతుందన్నారు. ప్రజలను చైతన్యపరిచే మహాత్తరమైన కృషిని ప్రజానాట్యమండలి కొనసాగిస్తుందన్నారు.

ప్రజా సమస్యల నుంచి ప్రజా కళలు ఉద్భవిస్తాయని పేర్కొన్నారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ప్రజా ఉద్యమాల్లో భాగమైన ప్రజానాట్యమండలి... సమాజం లోని మూఢాచారాలు, మహిళలు , దళితులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిందన్నారు. అక్షరాస్యత, సారా వ్యతిరేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిందని, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, యోగి వేమన వంటి సామాజిక వేత్తల జీవిత చరిత్రలను కళారూపాలుగా తీర్చిదిద్ది ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ఘనత ఈ వేదికకే దక్కుతుందన్నారు. ఈ నెల 25 నుంచి కర్నూలు వేదికగా ప్రజానాట్యమండలి 11వ రాష్ట్ర మహాసభ 'సఫ్దర్ హస్మీ ఓపెన్ థియేటర్' లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు దేవరకొండ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నోమేశ్వరి, నాగరాజు, ఆహ్వాన సంఘం కార్యదర్శి ఎం. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్