గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబహుముఖ కృషీవలుడు అరుణ్‌‌జీ

1 గంట క్రితం

ARUNJI SANTHAPPA SABA SPEECH BY CPIM LEADER V SRINIVASA RAO (1).JPG
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 10:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సంస్మరణ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ‘కళ కళ కోసం కాదు.. కాసుల కోసం అంతకంటే కాదు.. కళ ప్రజలు, సమాజం కోసం’ అని నమ్మి ఆచరణలో ఆ లక్ష్య సాధన కోసం 50 ఏళ్ల పాటు నిర్విరామంగా పని చేసిన బహుముఖ కృషీవలుడు అరుణ్‌‌జీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆయన మృతితో ప్రజా రంగం ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందని తెలిపారు. విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో గురువారం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.పద్మ అధ్యక్షతన సిపిఎం, ప్రజానాట్యమండలి సీనియర్‌ ‌నాయకులు అరుణ్‌జీ సంస్మరణ సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నేటి సమాజంలో కళ, సాంస్కృతిక రంగం వ్యాపారమయం అయ్యాయన్నారు. అరుణ్‌‌జీ.. కళను సంపాదనకు సాధనంగా ఎప్పుడూ చూడలేదని, లక్ష్య సాధన కోసమే ఉపయోగించారని కొనియాడారు. అలాంటి వారి స్ఫూర్తి సమాజంలో కనిపిస్తుందని, నేడు దేశంలో అనేక సమస్యలపై యువతరం శివమెత్తుతోందని, ఇది మంచి పరిణామమని అన్నారు. కడవరకూ శాస్ర్తీయ దృక్పథంతో అరుణ్‌‌జీ ప్రయాణం సాగిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట సాంస్కృతిక రంగాన్ని ఆ రోజుల్లో ప్రజానాట్య మండలి శాసించిందని, 1980వ దశకం వరకూ నాటి సినిమాల్లో పాత్రలు, భావజాలానికి ప్రజానాట్య మండలే మూలంగా ఉండేదని గుర్తు చేశారు. తొలితరం ప్రజానాట్యమండలి నేతల్లో అరుణ్‌జీ కీలకంగా పనిచేశారని, ఆయన మృతితో ప్రజా కళారంగం ఓ ఉత్తమ కళాకారున్ని కోల్పోయినట్టయిందన్నారు. సుమారు 30 ఏళ్ల పైచిలుకు కాలం అరుణ్‌జీతో తనకు ప్రత్యక్ష పరిచయం ఉందని, కళారంగానికి ఆయన చేసిన కృషిని దగ్గరగా చూశానని వివరించారు. ఉద్యోగ జీవితంలో ట్రేడ్‌ యూనియన్‌, పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన అరుణ్‌జీ ప్రజాశక్తి ఏజెన్సీ బాధ్యతలనూ చేపట్టి పత్రికను సమర్థవంతంగా పాఠకులకు చేరేలా చూశారని అన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ.. ప్రజా కళలు, సాంస్కృతికోద్యమం, ప్రజా ఉద్యమాల కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన అరుణ్‌జీ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పిఎన్‌ఎం ద్వారా కళలను కార్మికులు, ఉద్యోగులు, ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ.. జీవితాంతం కమ్యూనిస్టు ఆశయాలకు కట్టుబడి పనిచేసిన అరుణ్‌జీ సేవలు చిరస్మరణీయమన్నారు. 1975లో విజయవాడ నుంచి విశాఖకు వచ్చిన అరుణ్‌జీ ఉద్యోగ జీవితంతో పాటు పార్టీ, ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో విశాఖలో ప్రజానాట్యమండలి నిర్మాణానికి కీలకంగా పనిచేశారని, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రజా కళా ఉద్యమాన్ని విస్తరించారని వివరించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అనిల్‌ ‌మాట్లాడుతూ... అరుణ్‌జీ ఒక ఆదర్శ జీవి, ధన్యజీవి అని కొనియాడారు. ప్రజాశక్తి సిజిఎం వై.అచ్యుతరావు మాట్లాడుతూ.. అరుణ్ జీ మరణం పార్టీతో పాటు ప్రజాశక్తి దినపత్రికకూ తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు మంగరాజు, సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిఐటియు, ప్రజానాట్య మండలి నాయకులు, అరుణ్‌‌జీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తొలుత అరుణ్‌‌జీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ప్రజాశక్తి ప్రచురించిన అరుణ్‌‌జీ సంస్మరణ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్