2027లోనూ కొనసాగనున్న విపత్తు
తీవ్రస్థాయిలో వరదలు, కరువు, కాటకాలు
అసాధారణరీతిలో సన్నద్ధత అవసరం
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఒ) హెచ్చరిక
జెనీవా : భూ ఉష్ణతాపం ప్రభావంతో ప్రకృతి అతలాకుతలంగా మారుతోంది. వరదలు, కరువు, కాటకాలు విలయతాండవం చేస్తున్నాయి. పర్యావరణ పరిభాషలో ‘ఎల్ నినో’గా పేర్కొనే ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులు రాబోయే కాలంలో మరింత ఉధృతంగా మారనున్నాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఒ) గురువారం నాడు హెచ్చరించింది. 2027లో ఎల్‌నినో ప్రభావం మరింత బలమైనదిగా మారబోతోందని, దీనివల్ల వరదలు సంభవించడం, కరవు కాటకాలు నెలకొనడం వంటి వైపరీత్యాలతో పాటూ విపరీతమైన వేడిమి నెలకొంటుందని పేర్కొంది. ప్రస్తుత సన్నద్ధత ఈ పరిస్థితులను ఎదుర్కొవడానికి ఏమాత్రం సరిపోదని, అసాధారణరీతిలో సన్నద్ధత అవసరమని సభ్య దేశాల ప్రభుత్వాలకు డబ్ల్యుఎంఒ సూచించింది. పసిఫిక్ ప్రాంత వ్యాప్తంగా సముద్రం అసాధారణ రీతిలో వేడెక్కు తున్న కారణంగా ఈ ఏడాది చివరి నాటికి ఎల్‌నినో ప్రభావం మరింత ఉధృతమయ్యే అవకాశం వుందని డబ్ల్యుఎంఓ పేర్కొంది. దాదాపు వంద శాతమూ ఈ పరిస్థితులు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం వుందని పేర్కొంది.
ప్రమాదకరమైన జోన్‌లోకి ప్రపంచం : గుటెరస్
‘మన కళ్ళ ముందే ఎల్‌నినో భారీ స్థాయికి పెరుగుతోంది.’ అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ హెచ్చరించారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, అందుకు తగినట్లుగా అన్ని చోట్లా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే వుండడంతో యావత్ ప్రపంచం ప్రమాదకరమైన వాతావరణ జోన్‌లోకి నెట్టబడు తోందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూసినట్లైతే, మనం పర్యవేక్షణ ప్రారంభమైనప్పటి నుండి అంటే గత నాలుగు దశాబ్దాల నుండి ఇప్పటివరకున్నదానికన్నా ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రంగా వుండబోతోందని డబ్ల్యుఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టె సౌలో జెనీవాలో పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. అన్ని దేశాలు కూడా నిశితంగా ఈ పరిస్థితులను గమనిస్తూ, అందుకు తగినట్లుగా స్పందించాలని, చర్యలు చేపట్టాలని డబ్ల్యుఎంఓ పిలుపిచ్చింది. ఇప్పటికే వరదలు, దుర్భిక్ష పరిస్థితులను చూస్తున్నామని, ఇవి రాబోయే కాలంలో ఇంకా ఉధృతంగా వుండే ప్రమాదముందని అన్నారు. అసాధారణంగా ఏర్పడే ఈ ఎల్‌నినో ప్రభావాల వల్ల మన సన్నద్ధత, స్పందన కూడా అసాధారణ రీతిలోనే వుండాలని సౌలో పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)