విశాఖ కెజిహెచ్‌కు భౌతికకాయం అప్పగింత
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో, మాధవదార (విశాఖపట్నం), అమరావతి బ్యూరో : సిపిఎం సీనియర్ నాయకులు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుల్లో ఒకరైన కంచర్ల నరసింహారావు (అరుణ్ జీ) (84) మంగళవారం అర్ధరాత్రి విశాఖ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్నారు. విశాఖలోని మర్రిపాలెం- కరాస వద్దగల ఆయన స్వగృహంలో భౌతిక కాయాన్ని సిపిఎం సీనియర్ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు సందర్శించి, పూలమాలలు వేశారు. ‘కడవరకూ కమ్యూనిస్టు ఆశయసాధనకు కృషి చేశారంటూ’ ఘనంగా నివాళులర్పించారు. అరుణ్ జీ ఇంటి నుంచి హష్మీభవన్‌కు ఆయన అంతిమయాత్ర బుధవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. హష్మీభవన్‌లో భౌతికకాయాన్ని కాసేపు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం భౌతికకాయాన్ని వైద్య విద్యార్థులకు ఉపయోగపడేలా విశాఖ కెజిహెచ్ అనాటమీ విభాగానికి అప్పగించారు. అరుణ్ జీ స్వస్థలం కృష్ణా జిల్లా కానురు. లక్ష్మయ్య, అనసూయ దంపతులకు జన్మించారు. భార్య ప్రమీల, ఇద్దరు కుమార్తెలు కృష్ణభారతి, కృష్ణజ్యోతి, పెద్దల్లుడు కోనేరు శ్రీనివాసరావు, చిన్నల్లుడు గద్దె వెంకటకృష్ణ ఉన్నారు. నేవల్ కమాండ్ వర్క్ షాప్‌లో పంప్ ఫట్టర్ గా అరుణ్ జీ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. కళా- జగతి పత్రికలో సబ్ ఎడిటర్ చేసి ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నాటక పోటీలు, పరిషత్తులో ప్రదర్శించే నాటకాలపై ఆయా కథాంశాలపై విమర్శాత్మక వ్యాసాలు రాసేవారు. రచయిత, దర్శకుడు, రేడియో ఆర్టిస్ట్, అర్గనైజర్, ప్రయోక్త, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుపొందారు.
ప్రజా నాట్యమండలి నిర్మాణంలో అరుణ్ జీ కీలక పాత్ర
అరుణ్ జీ ఇంటి వద్ద జరిగిన సంతాప సభలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ, సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ నవసమాజ నిర్మాణానికి పరితపించి ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తూ, సాంస్కృతిక, కళా రంగం ప్రజానాట్యమండలిలో ఆయన చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. క్రమశిక్షణ, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన అరుణ్‌జీ తన గొంతు మూగబోయినా కమ్యూనిస్టు ఆశయ సాధనకు అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజాశక్తి దినపత్రికకు మర్రిపాలెం ప్రాంతంలో ఏజెంట్‌గా వ్యవహరిస్తూ పత్రిక పాఠకులకు చేరవేసేందుకు కృషిచేశారని కొనియాడారు.
కళా రంగానికి, సాంస్కృతికోద్యమానికి తీరని లోటు : సిపిఎం
అరుణ్ జీ మృతి కళా రంగానికి, సాంస్కృతికోద్యమానికి తీరని లోటని సిపిఎం విచారం వ్యక్తం చేసింది. ఆయన మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజానాట్యమండలిపై ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత ప్రజానాట్యమండలి పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. 1990 నుండి తనకు అరుణ్ జీతో, వ్యక్తిగతంగానూ, ఆ రంగంతోనూ ప్రత్యక్షంగా సంబంధాలున్నాయని తెలిపారు. ఆయన క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతగల వ్యక్తి అని కొనియాడారు. జీవితచరమాంకం వరకు కళను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి తపనపడ్డారని, సఫ్టర్ హష్మి స్పూర్తితో వీధినాటికల్లో శిక్షణ ఇచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేకమందిని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కొద్దికాలం క్రితం ఒక సమావేశంలో ఆయనను కలిశానని గుర్తు చేసుకున్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నా ఆయనలో సడలని పట్టుదల చూశానని పేర్కొన్నారు.

పలు సంఘాల నివాళి
ప్రజానాట్య మండలి పునర్నిర్మాణంలో కీలకపాత్ర వహించిన అరుణ్ జీ మృతి పట్ల పలు సంఘాల నాయకులు బుధవారం అరుణాంజలి ఘటించారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యాలయంలో అరుణ్ జీ చిత్రపటానికి పూలమాల వేసి రాష్ట్ర కమిటీ నాయకులు నివాళులర్పించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజానాట్య మండలిపై పాలకులు నిషేధించిన అనంతరం ప్రజానాట్య మండలి పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారిలో అరుణ్ జీ ఒకరని కొనియాడారు. అరుణ్ జీ మృతికి కెవిపిఎస్, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీలు నివాళులర్పించాయి. ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి, ఎపి వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమ్యూనిస్టు ఆశయ సాధన కోసం తుది వరకూ కృషి చేసిన యోధుడు అరుణ్ జీ అని సిఐటియు రాష్ర్ట అధ్యక్షులు సిహెచ్.నరసింగరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఉద్యోగం చేస్తూ జీవితాంతం ఉద్యమమే ఊపిరిగా పనిచేశారని తెలిపారు. అరుణ్ జీ మృతికి ప్రజాశక్తి ఎడిటర్ బి.తులసీదాస్, సిజిఎం వై.అచ్యుతరావు, హెచ్‌ఆర్ జనర్ మేనేజర్ తోడర్‌మల్, విశాఖ జనరల్ మేనేజర్ ఎం.వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.








కామెంట్‌లు (0)