ప్రజాశక్తి - వేలేరుపాడు రూరల్ (ఏలూరు జిల్లా) : వేలేరుపాడు మండలం శివకాశిపురంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం విద్యుదాఘాతంతో ఎనిమిదో తరగతి విద్యార్థిని లక్ష్మీపార్వతి (13) మృతి చెందారు. మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని కట్కూరు పంచాయతీ చిట్టెంరెడ్డిపాలేనికి చెందిన కెచ్చెల సుధాకర్ రెడ్డి, కమల దంపతుల కుమార్తె లక్ష్మీపార్వతి. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతుంది. ఉదయం ఆరు గంటలకు ఆరబెట్టిన యూనిఫారం తెచ్చుకునే క్రమంలో కిటికీ పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. తోటి విద్యార్థులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా మరో విద్యార్థిని కరెంట్ షాక్‌కు గురైంది. వెంటనే ఆశ్రమ ఉపాధ్యాయులు గమనించి వారిని స్థానిక ప్రభు త్వాసుపత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మీపార్వతి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
మృతదేహంతో పాఠశాల వద్ద ఆందోళన
తల్లిదండ్రులు, బంధువుల పాఠశాల వద్దకు చేరుకుని మృతదేహంతో పాఠశాల గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆదివాసీ, ప్రజా సంఘాల నేతలు తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపారు. కెఆర్‌పురం ఐటిడిఎ పిఒ రాములు నాయక్ అక్కడికి చేరుకుని తల్లిదండ్రులను ఓదార్చారు. పాఠశాల వార్డెన్ ను, ప్రదానోపాధ్యాయురాలిని విధుల నుంచి బహిష్కరించాలని, విద్యార్థిని తల్లిదండ్రులకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం, రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల భూమి, తక్షణ సాయంగా మట్టి ఖర్చుల కింద రూ.లక్ష ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. పిఒ స్పందిస్తూ ఇదే పాఠశాలలో తండ్రికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని, మిగిలిన డిమాండ్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. హాస్టల్ వార్డెన్ ను, ప్రధానోపాధ్యాయులను వెంటనే సస్పెండ్ చేస్తున్నామని, ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆందోళన విరమించారు.








కామెంట్‌లు (0)