బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఓటు హక్కుపై దాడి

1 గంట క్రితం

arun
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 11:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎస్‌ఐఆర్ పేరుతో అన్యాయం జరిగితే సహించం : అరుణ్‌‌కుమార్‌

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ : భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ కల్పించిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు ఓటు హక్కు అని, అయితే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్.అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్య వాదులు అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు పోరాడే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎస్‌ఐఆర్ ప్రక్రియ – ప్రజాస్వామ్యంపై ప్రభావం’ అనే అంశంపై విశాఖపట్నం డాబాగార్డెన్స్ సమీపంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో బుధవారం సాయంత్రం సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు అరుణ్‌‌కుమార్‌ ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలను తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిస్థాయిలో ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తికాలేదని, దీంతో ఈ నెల 24 వరకు పొడిగించారని తెలిపారు. గతంలో ఈ ప్రక్రియ అమలైన రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే కోట్లాది మంది అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించబడ్డాయని ఆరోపించారు. ఇది కేవలం ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మాత్రమే కాదని, పౌరసత్వ అంశాన్ని పరోక్షంగా అమలు చేసే ప్రయత్నంగా మారుతోందని వ్యాఖ్యానించారు.

బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని, అందులో ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఉండే ఓటర్లే అధికంగా ఉన్నారనే ఆరోపణలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారికి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కూడా ప్రభావం పడుతోందని, భవిష్యత్తులో ఇతర గుర్తింపు పత్రాలపై కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజన వర్గాలకు చెందిన ఓటర్ల పేర్లు అధికంగా తొలగించబడుతున్నాయనే ఆరోపణలు అత్యంత ఆందోళనకరమని అన్నారు. "ఒకే దేశం–ఒకే ఎన్నిక", "ఒకే దేశం–ఒకే మతం", "ఒకే దేశం–ఒకే పార్టీ" అనే విధానాలను అమలు చేయాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును పరిరక్షించేందుకు రాజకీయ భేదాలకు అతీతంగా ప్రజాస్వామ్య విలువలను విశ్వసించే అన్ని శక్తులు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ సదస్సులో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్, బి.జగన్, వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్