సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అధికార బలంతో ఏకగ్రీవాలకు యత్నం

5 గంటల క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 09:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- చిన్న సాకులతో నామినేషన్ల తిరస్కరణ

- అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ప్రజాశక్తి - యంత్రాంగం: అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో అధికారులు పలువురి నామినేషన్లను తిరస్కరించారు. చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి నామినేషన్లను పక్కన పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రికి రాత్రే కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చి తమను అనర్హులుగా ప్రకటిస్తున్నారని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ స్థానాలను ఎలాగైనా ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పక్ష నేతలు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రదర్శిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతిలో సిపిఎం తరపున 58వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి రాధమ్మ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. రాధమ్మ నామినేషన్ ఎన్నికల అధికారి తిరస్కరిస్తున్నట్టు ప్రకటించడంతో ఎందుకు తిరస్కరించారని కారణాలు చెప్పాలని సిపిఎం నాయకులు కోరడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి 57వ డివిజన్‌లో ఉంటున్న రాధమ్మ 58వ డివిజన్‌లో పోటీ చేయడానికి లేదంటూ సాకు చూపించి నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో ఆమె ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. 48, 49 వార్డులకు సిపిఎం అభ్యర్ధులు నామినేషన్‌ దాఖలు చేసినప్పటికీ జాబితాలో సంఖ్యాపరంగా జీరో చూపించారు.

మడకశిరలో జనసేనకు షాక్‌

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో జనసేనకు గట్టి షాక్‌ ‌తగిలింది. కూటమి తరుపున జనసేన అభ్యర్థిగా చైర్మన్‌ పదవికి ఎస్‌‌సి.శ్రీనివాసులు నామినేషన్ వేశారు. ఆయనతోపాటు సంజీవరత్న, టి.రామకృష్ణ డమ్మీలుగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈ ముగ్గురు నామినేషన్లు స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. పత్రాల్లో అన్నింటిని పూరించకపోవడంతో తిరస్కరించినట్టు ఎన్నికల అధికారి ‌తెలిపారు.

తాడిప్రతిలో 26 వార్డులకు సింగిల్‌ నామినేషన్లు

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 48 వార్డులకుగానూ స్క్రూటినీ తరువాత 26 వార్డులకు సింగిల్‌ ‌నామినేషన్‌‌లు దాఖలైనట్టు సమాచారం. గుత్తిలో ఛైర్మన్‌ పదవికి ఎనిమిది నామినేషన్లు దాఖలవ్వగా వైసిపి, బిఎస్‌పితో ఇతర అభ్యర్ధుల నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. టిడిపి అభ్యర్థివి ఒక్కటే ఆమోదం పొందడంతో చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.

కోర్టు ఉత్తర్వులతో దాఖలు చేసినా తిరస్కరణ

కోర్టు ఉత్తర్వులతో నామినేషన్ దాఖలు చేసిన దాచేపల్లి నగర పంచాయతీ వైసిపి చైర్మన్ అభ్యర్థి కొప్పుల రవికుమార్ నామినేషన్ను అధికారులు తిరస్కరించారు . నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్ రూ.3,000 చెల్లించని కారణంగా ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు తెలిపారు. టిడిపి అభ్యర్థి తంగెళ్ల శ్రీనివాసరావు నామినేషన్ ఆమోదం పొందడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్‌కు పోటీచేసిన టిడిపి, వైసిపి అభ్యర్ధుల నామినేషన్లను పెండింగ్‌లో ఉంచారు. కమలాపురం, బద్వేలు, రాజంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పదవులకు ఎవ్వరూ పోటీ చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో ఈ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్