- ద్వంసం చేసిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
- ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం డిమాండ్
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : హైటెన్షన్ విద్యుత్ టవర్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంలో భాగంగా అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం శ్రీధర్ ఘట్ట పరిధిలో రైతులపై రెవెన్యూ, పోలీస్ అధికారుల దౌర్జన్యకాండను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖండించింది. బాధ్యులైన ప్రభుత్వ అధికారులు, విద్యుత్ టవర్ల నిర్మాణ సంస్థ రిసోనియాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎపి రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.క్రిష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు. పేద రైతులు అమర్, రామసుబ్బమ్మ, లక్ష్మీదేవి, సుంకన్న తదితరులపై 150 మందికి పైగా పోలీసులు మోహరించి అక్రమంగా అరెస్టు చేసి, సాగు చేసిన మొక్కజొన్న పంటను జేసిబిలతో ద్వంసం చేశారు. విద్యుత్ టవర్ల నిర్మాణ సంస్థ రిసోనియా కంపెనీకి అనుకూలంగా రైతులపై దౌర్జన్యం చేసిన రెవెన్యూ, పోలీస్ అధికారులపై, రిసోనియా కంపెనీపై సర్కార్ చర్యలు తీసుకోవాలి. రైతుల జిరాయితీ పట్టా భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు దౌర్జన్యం చేయడం ఇదెక్కడి న్యాయం? ఎక్కడైనా ప్రభుత్వ, ప్రయివేటు అవసరాలకు భూములు సేకరించాల్సి వస్తే 2013 చట్టం ప్రకారం రైతులకు న్యాయమైన పరిహారం ఇచ్చి, వారి ఆమోదం తరువాతనే భూములలోకి ప్రవేశించాలి తప్ప రైతులపై దౌర్జన్యం చేస్తారా? విద్యుత్ టవర్ల కంపెనికి అనుకూలంగా రైతులపై దౌర్జన్యం చేసే అధికారం ఎక్కడిది? ఈ రకంగా చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై, రిసోనియా కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)