- నేటి నుంచి జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు
- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నేత్రదానంపై ప్రజల్లో అవగాహన క్రమంగా పెరుగుతోందని, దీనిని మరింత విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో అవగాహన కరపత్రాన్ని సోమవారం ఆయన విడుదల చేశారు. నేత్రదానం ద్వారా కార్నియా సంబంధిత అంధత్వంతో బాధపడుతున్న వారికి చూపును అందించవచ్చని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బోధనాసుపత్రుల్లో వివిధ అనారోగ్య కారణాలతో ప్రాణాలు విడిచిన వారి నుంచి కార్నియాలు సేకరిస్తున్నారని తెలిపారు. కుటుంబ సభ్యుల ఆమోదంతో రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఎల్వీ ప్రసాద్, శంకర, పుష్పగిరి కంటి ఆసుపత్రుల ద్వారా కార్నియాల సేకరణ జరుగుతోందని వివరించారు. వీటిని ఐ బ్యాంకుల్లో భద్రపరచి అవసరమైన వారికి శస్త్ర చికిత్స ద్వారా కంటి వెలుగు ప్రసాదిస్తున్నారని పేర్కొన్నారు. 2024-25 నుంచి 2026-27 జూలై వరకు మూడు ఆర్థిక సంవత్సరాల్లోనే 13,803 కార్నియాలు సేకరించారని తెలిపారు.ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల ఆధారంగా కొనసాగుతున్న ఈ ప్రక్రియను ప్రభుత్వపరంగా కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కర్నూలు, విశాఖపట్నంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రులను అత్యాధునిక పరికరాలతో సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 8 వరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో నిర్వహించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కెవిఎన్ చక్రధర్‌బాబు, జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ బి.స్వరణ్ రాజ్, డైరెక్టర్ జనరల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అరుణ్ బాబు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)