- యుఎఫ్‌బియు ఆధ్వర్యంలో నిరసనలు
- స్తంభించిన లావాదేవీలు
ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ర్టంలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతమైంది. బ్యాంకులు మూతపడడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని, ఉద్యోగుల మధ్య విభజన చేస్తూ అమలు చేస్తున్న పిఎల్ఐ విధానాన్ని తక్షణమే నిలిపివేసి అందరికీ సమానమైన విధానాన్ని అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు.
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) పిలుపులో భాగంగా దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. “ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయాలి”, “ఈక్వల్ పిఎల్ఐ వి డిమాండ్” అంటూ నినాదాలు చేశారు. సిపిఎం, సిఐటియు, ఎఐటియుసి, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, పోస్టల్, ఎస్‌బిఐ పెన్షనర్ల సంఘంతో పాటు పలు సంఘాలు మద్దతు తెలిపాయి.
ఎన్‌టిఆర్ జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు స్తంభించాయి. విజయవాడ ధర్నాచౌక్‌లో నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఎన్‌పిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెన్షన్ నవీకరణ, రిటైర్డ్ ఉద్యోగుల వైద్య బీమా ప్రీమియం వంటి డిమాండ్లను పరిష్కరించాలని నేతలు కోరారు. గతంలో కుదిరిన ఒప్పందానికి సంబంధించిన సిఫారసులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉండడం శోచనీయమన్నారు. సెప్టెంబర్ ఎనిమిది, తొమ్మిదిన జరిగిన రాజీ చర్చలు విఫలమవ్వడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల సమ్మె, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని యూనియన్ నేతలు హెచ్చరించారు. యూనియన్ జనరల్ సెక్రటరీ జి.కాశీ విశ్వనాథ్, సిఐటియు రాష్ర్ట కార్యదర్శి పి.అజయ్ కుమార్, బిఇఎఫ్‌ఐ జనరల్ సెక్రటరీ అజయ్ కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ ఎస్. వి. రమణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బందరులోని లక్ష్మీ టాకీస్ సెంటర్, గుడివాడ, అవనిగడ్డ, గన్నవరం, ఉయ్యూరు, పెడన, కంకిపాడు, కోడూరులో నిరసన తెలిపారు.
విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. నేషనల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉప ప్రధాన కార్యదర్శి ఎ.సుష్మ మాట్లాడుతూ.. ఐదు రోజుల పని దినాలు అమలుచేస్తామని చెప్పి ఆచరణలో మాటతప్పడం సరికాదన్నారు. పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ మద్దతు తెలిపారు. అనకాపల్లి నెహ్రూ చౌక్‌లోని ఎస్‌బిఐ ప్రధాన కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఆందోళన చేపట్టారు. వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి ఎన్‌టిఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేసి, నెహ్రూ చౌక్ జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వివి.శ్రీనివాసరావు ఆర్.శంకర్‌రావు మద్దతు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ బ్యాంకులు మూతపడ్డాయి. విజయనగరంలో వందలాది మంది ఉద్యోగులు నగరంలోని ఎంఆర్ స్టేడియం నుంచి మూడులాంతర్లు, గంటస్తంభం వరకూ ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి రాజవిహార్, మౌర్య ఇన్, ఐదు రోడ్స్ జంక్షన్, రాజ్ థియేటర్ మీదుగా కెఇ ప్లాజా వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా వరకూ ర్యాలీ నిర్వహించి,“ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయాలి”, “ఈక్వల్ పిఎల్ఐ వి డిమాండ్” అంటూ దారిపొడవునా నినాదాలు చేశారు.
తిరుపతి పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి. నరసింహారావు మాట్లాడుతూ..బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు, నెల్లూరులో నిరసన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కంబాల చెరువు వద్ద ఉన్న ఎస్‌బిఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కాకినాడ, అమలాపురంలో ఎస్‌బిఐ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్‌లోని మున్సిపల్ కళా ప్రాంగణ ఆవరణంలో నిర్వహించిన సభకు జిల్లా నలుమూలల నుంచి బ్యాంకు సిబ్బంది, అధికారులు వందలాదిగా తరలివచ్చారు. మార్కాపురం, బాపట్ల జిల్లాల్లో సమ్మె చేపట్టారు. కడప జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లా రాయచోటి, పీలేరులో నిరసన తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో సుమారు మూడు వందల బ్యాంకులు మూతపడగా రూ.80 నుంచి రూ.వంద కోట్లు వరకూ లావాదేవీలు స్తంభించాయి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాజారామ్మోహన్‌రాయ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు.








కామెంట్‌లు (0)