- మంగంపేట జాతిసంపదను కాపాడుకుందాం
- ఎగుమతులు నిలిపేయాలి : నిజనిర్ధారణ కమిటీ
ప్రజాశక్తి -తిరుపతి టౌన్ : దేశంలో అత్యంత అరుదైన సహజ ఖనిజ సంపదైన మంగంపేట బెరైటీస్‌ను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా విదేశాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం దారుణమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు అన్నారు. బల్క్ టెండర్‌ను రద్దుచేసి ఎగుమతులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ మంగంపేట బెరైటీస్ భావితరాలకు చాలా అవసరమని, ఈ ఖనిజం విదేశాలకు తరలి వెళ్లిపోవడం వల్ల స్థానిక మిల్లర్లు నష్టపోయే ప్రమాదం ఉందని, దీనిపై ఆధారపడిన వేలాది కార్మిక కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగంపేట బెరైటీస్ వాస్తవ పరిస్థితులపై నిజ నిర్ధారణ కమిటీ ఆ ప్రాంతంలో పర్యటించి అనేక విషయాలు సేకరించిందన్నారు. ఎపిఎండిసి సిపిఒ గోపీనాథ్‌తో చర్చించామని, 2028 నాటికి గనిని మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ఆందోళనకర అంశంమని తెలిపారు. మంగంపేట బెరైటీస్ ద్వారా ఎపిఎండిసికి ఏటా రూ.1300 కోట్లు ఆదాయం వస్తోందని వివరించారు. దీని పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. విశ్రాంత ఐపిఎస్ ఎబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతేడాది జనవరి 24న సి ప్లస్ డి ప్లస్ డబ్ల్యు గ్రేడ్ బెరైటీస్‌ను భారీ పరిమాణంలో విక్రయించేందుకు బల్క్ టెండర్‌ను విడుదల చేసిందని తెలిపారు. ఐదేళ్లలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని విక్రయించే ఈ టెండర్‌ను 50 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరాకు ఎంప్రద మైన్స్ సంస్థతో 2025లో ఫిబ్రవరి 12న ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. గత వైసిపి ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు బెరైటీస్‌లో అవినీతి జరిగిందని అసెంబ్లీ సాక్షిగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారని, ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వమే ఆ కంపెనీకి టెండర్ ఇవ్వడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. విశ్రాంత ఐఎఎస్ బండ్ల శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ ఎం గేయనంద్ మాట్లాడుతూ ప్రభుత్వ టెండర్లు పారదర్శకత సమాన అవకాశాలు ఉండాలన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 స్ఫూర్తికి బెరైటీస్ విధానం పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఈ సంపదను కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకు అంధకారమేనని తెలిపారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, ప్రొఫెసర్ సి రామచంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంగంపేట ఖనిజాన్ని విచ్చలవిడిగా విదేశాలకు తరలించి దేశానికి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.








కామెంట్‌లు (0)