ప్రజాశక్తి- ఎ.కొండూరు : గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. శనివారం ఆయన ఎన్‌టిఆర్ జిల్లా మండల కేంద్రంలోని ఎ.కొండూరు అడ్డరోడ్డు సమీపంలోగల చైతన్యనగర్ తండాలోని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను పలువురు సిపిఎం నాయకులతో కలిసి సందర్శించారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, వారికి కల్పిస్తున్న వసతులు, విద్యాబోధన తదితర అంశాలపై ఇన్‌ఛార్జి హెచ్‌ఎం పి.అనురాధను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, డార్మెటరీ, వంటశాల, వాటర్ ప్లాంట్, హాస్టల్ గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాల్లో పాములు సంచరిస్తున్నాయని, రాత్రి వేళల్లో దోమలు, కోతుల బెడద అధికంగా ఉంటోందని వారు తెలిపారు. అలర్జీ కారణంగా కొందరికి చర్మంపై దురదలు వంటి సమస్యలు వస్తున్నాయని శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మంచి ఆహారం, సురక్షితమైన వసతి, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పాఠశాల భవనాలు, హాస్టల్ పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడేందుకు పారిశుధ్య పనులను సమర్థవంతంగా నిర్వహించాలని, పాములు, దోమలు, కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పాఠశాల నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, వై.వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి పి.ఆనందరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు బి.మురళీకృష్ణ, ఎం.నాగరాజు, సోమా చైతన్య, బి.జమలమ్మ, జె.ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
Print Editionగిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి : వి శ్రీనివాసరావు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 09:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)