- యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ప్రత్యేక కమిషన్ అధ్యయనం ఆధారం
- హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’లో వెల్లడైన సమకాలీన జనాభా వివరాలు, ప్రత్యేక కమిషన్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగానే స్థానిక సంస్థల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో బిసిలు 50.42 శాతం ఉన్నారని తెలిపింది. 2020లో మొత్తం ఓటర్లలో బిసిల వాటా 48.13 శాతంగా ఉండగా, ప్రస్తుత కుటుంబ సర్వేలో వారి జనాభా మరింత పెరిగినట్లు పేర్కొంది. రాష్ట్రంలోని బిసిల సంఖ్యాబలం, భౌగోళిక విస్తరణ, సామాజిక వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని స్థానిక పాలనలో వారికి కేవలం నామమాత్రపు కాకుండా అర్థవంతమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు 34 శాతం రిజర్వేషన్లు అవసరమని నిర్ణయించినట్లు వివరించింది.
బిసిల సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు, వారి జనాభా, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యాన్ని అధ్యయనం చేసేందుకు మాజీ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కమిషన్ అధ్యయనం, సమకాలీన కుటుంబ సర్వే వివరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన అనంతరమే రిజర్వేషన్లు ఖరారు చేశామని పేర్కొంది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వెనుకబడిన తరగతులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-డీ(6), 243-టీ(6) అనుమతిస్తున్నాయని తెలిపింది. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం కారణంగా రాజకీయ అధికారం, స్థానిక నిర్ణయ ప్రక్రియల్లో తగిన ప్రాతినిధ్యం లేని వర్గాలకు ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో సమర్థవంతమైన భాగస్వామ్యం కల్పించడమే రాజ్యాంగ లక్ష్యమని వివరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 34 శాతం బిసి రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించుతాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి బిఎవిపి కుమారరెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. బిసిలకు రిజర్వేషన్లు జనాభా శాతం ఆధారంగా నిర్ణయించలేదని, స్థానిక అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, పౌర పాలనలో వారికి సమర్థవంతమైన భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యమని రాష్ట్రప్రభుత్వ వివరించింది. అందువల్ల 34 శాతం బిసి రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను కొట్టివేయాలని హైకోర్టును కోరింది.








కామెంట్‌లు (0)