- భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయాలి
- డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వాగులు, వంకలు పొంగుతున్నందున ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన చోట పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులతో సమీక్షించినట్లు శనివారం ఎక్స్ ద్వారా తెలిపారు. వర్షాలు తగ్గే వరకు అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు రాకుండా అవగాహన కల్పించాలని తెలిపారు. పలు ప్రాంతాల్లో వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని, కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జికె వీధి మండలం గంగవరం సమీపంలో ఎపి, ఒడిశా సరిహద్దులో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రత్యామ్నాయ రాకపోకల ఏర్పాట్లపై దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి, ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట తక్షణమే పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, అత్యవసర సేవల సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ప్రజలు, అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)