శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కదిరిలో బెట్టింగ్ ముఠా అరెస్ట్

8 గంటల క్రితం

betting.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 08:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కదిరి టౌన్ : శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకి సహకరిస్తున్న ముఠా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. అనుమతులు లేని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తూ కమీషన్లు పొందుతున్న ముఠాకు సంబంధించిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.6,77,400 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, తొమ్మిది బ్యాంకు పాస్‌బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ సిఐ వెంకటేశ్వర్లు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. టెలిగ్రామ్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకున్న కొందరు నిర్వాహకులు స్థానిక యువకులను ఈ వ్యవహారంలోకి దింపారు. బ్యాంకు ఖాతాల ద్వారా జరిగే నగదు లావాదేవీలకు ప్రతి లక్ష రూపాయలకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు కమీషన్ పొందే విధంగా ఆశచూపి యువకుల బ్యాంకు ఖాతాలను వాడుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ల గ్రామ శివారులో గురువారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు బయటపడింది. దీంతో ‌వారిని అరెస్ట్ చేసి, ఈ కేసులో ప్రధాన నిర్వాహకులుగా అనుమానిస్తున్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు తమ బ్యాంకు ఖాతాలు, పాస్‌బుక్కులు, ఎటిఎం కార్డులు, నగదు బదిలీ వివరాలను ఇతరులకు అందించవద్దని సిఐ ప్రజలకు సూచించారు. ఇలాంటి అక్రమ లావాదేవీలకు సహకరిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ లేదా సైబర్ మోసాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 112 లేదా సైబర్ నేరాల ఫిర్యాదు నంబరు 1930కు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సబ్ ఇ‌న్‌స్పెక్టర్‌ బాబ్జాన్, సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్