శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅత్యాచార నిందితులకు బిజెపి మద్దతు

1 గంట క్రితం

girl raped - cow worshipped.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 05:22 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఈ నెల 6వ తేదీన పత్రికలలో వచ్చిన రెండు వార్తలు మహిళల భద్రతపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు వైఖరులను వెల్లడిస్తున్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న సందర్భంలో మహిళా జర్నలిస్టుల పట్ల అనుచితంగా వ్యవహరించిన ఎసిపి భగత్‌కు కేంద్ర ప్రభుత్వం డిసిపిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆందోళనను కవర్‌ చేస్తున్న మహిళా జర్నలిస్టులు ఎసిపి తమను అనుచితంగా తాకాడని, అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై ''వీడియో సాక్ష్యం ఉంటేనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని'' పోలీసులు సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో పోలీసులు చెప్పినది గల్లీలో ఉన్న పోలీసులకు, నేరస్తులకు కూడా వినిపిస్తుంది కదా! కాబట్టి ఈ వ్యాఖ్యలతో మహిళలు మరింత దయనీయ స్థితిలోకి నెట్టబడతారు. ఢిల్లీ పోలీసుల వ్యాఖ్యలు మహిళలపై వేధింపులకు పాల్పడే వారికి, అత్యాచారాలు చేసేవారికి ఎక్కడ లేని ధైర్యం ఇస్తాయి. సాక్ష్యం లేకుండా మహిళలను ఏమైనా చేయవచ్చునని నేరాలు చేసేవారు తెగింపుతో వ్యవహరించటానికి కారణమౌతాయి. ప్రతిపక్షాలు, ప్రజలు ఆందోళనలలో పాల్గొన్న మహిళలను ఇప్పటి వరకు మహిళా పోలీసులే అరెస్టు చేస్తున్నారు. కానీ...మగ పోలీసులు మహిళలతో తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించటానికి ఇపుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు దోహదం చేస్తుంది. మహిళల పట్ల ఎంత బరితెగించి వ్యవహరించినా తమకు ఏ విధమైన ప్రమాదం ఉండదని, పైగా ప్రమోషన్లు కూడా పొందవచ్చునని పోలీసులు భావిస్తారు. పోలీసులే చేస్తుంటే తమకేమిటని మహిళలను వేధించేవారు కూడా తమకు లైసెన్సు ఇచ్చినట్లు సంతోషిస్తారు. ఇటువంటి వాతావరణం ఫలితంగానే మహిళలపై అత్యాచారాలు, వేధింపులు పెరుగుతున్నాయి.

ఢిల్లీలో మహిళలపై వరుస అత్యాచారాలు జరగటం, కొన్ని ప్రాంతాలలో మహిళలకు భద్రత లేని పరిస్థితులపై స్పందించిన సుప్రీంకోర్టు బెంచ్‌ స్వయంగా విచారణ చేపట్టటాన్ని అభినందించాలి. కాని ఈ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు నేరస్తులను కఠినంగా శిక్షించటం ద్వారా నేరాలను అరికట్టవచ్చుననే భావాన్ని కలిగిస్తున్నాయి. జస్టిస్‌ జె.బి.పార్దివాలా, జస్టిక్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మహిళలపై నేరాలకు పాల్పడే గూండాల గుండెల్లో భయం పుట్టించాలని, తప్పు చేస్తే చంపేస్తామన్న భయం ఉండాలని చెప్పింది. నేరం జరిగిన తర్వాత ఏం చేశామన్నది కాకుండా నేరం జరగకుండా నివారించటం ముఖ్యం అని పేర్కొంది. బెంచ్‌ చేసిన వ్యాఖ్యలలో ఇది కీలకమైనది. నేరం జరగకుండా ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకోవటం అత్యంత ప్రధానమైనది.

మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, మానభంగాలు తదితరాలను నివారించటానికి చట్టపరమైన చర్యలతో పాటు, మహిళలను సమాన హోదా కలిగిన పౌరులుగా గుర్తించటం, ఇంటా బయటా వారిని గౌరవించటం, కుటుంబంలో, సమాజంలో, ఉత్పత్తి రంగంలో వారు నిర్వహించే పాత్రకు తగిన గుర్తింపు ఇవ్వటం ముఖ్యమైనవి. కాని కేంద్రంలో‌ ఉన్న బిజెపి ప్రభుత్వం, ఆ పార్టీ, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌లు మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, మానభంగాలు పెరగటానికి అవసరమైన వాతావరణాన్ని, భావజాలాన్ని పెంచి పోషిస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు జరిగిన వివిధ సందర్భాలను మనం పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమౌతుంది.

గుజరాత్‌లో 2002లో జరిగిన మారణకాండలో వెయ్యి మందికి పైగా హతులైనారు. వారిలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. ముస్లిం మహిళలపై సామూహిక మానభంగాలు, హత్యలు జరిగాయి. బిజెపి మంత్రులు, శాసనసభ్యులు, ఆ పార్టీ నాయకులు ఈ మానభంగాలు, హత్యాకాండకు నాయకత్వం వహించారు. ఆ కేసులలోనూ, మహిళలపై అత్యాచారాలు చేసిన వారు జైళ్ళ నుండి విడుదలైనపుడు సంఘ్‌ పరివార్‌, బిజెపి కార్యకర్తలు, నాయకులు వారికి స్వాగతం పలికి, సన్మానాలు చేస్తున్నారు. ఈ విధంగా నేరస్తుల మనోధైర్యాన్ని పెంచుతున్నారు.

సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌ తదితర మహిళా అథ్లెట్లు వివిధ అంతర్జాతీయ కుస్తీ పోటీలలో పాల్గొని, పతకాలు సంపాదించి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినవారు. భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఆయనపై చర్య తీసుకోకపోవటంతో ఢిల్లీలో నిరవధిక పోరాటం చేశారు. నెలల తరబడి పోరాటం జరిగినా ప్రధాని, కేంద్రమంత్రులు, బిజెపి నాయకులు నోరు మెదపలేదు. వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ ఇప్పటికీ బిజెపి నాయకునిగా ఉన్నాడు.

మణిపూర్‌లో తెగల మధ్య హింసాకాండ జరిగిన సందర్భంలో మహిళలపై పెద్ద సంఖ్యలో అత్యాచారాలు, హత్యలు జరిగాయి. ఆందోళనకారులు ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి, బహిరంగంగా ఊరేగించారు. నెలల తరబడి ఇళ్ళపై దాడులు, అత్యాచారాలు, హత్యలు చేశారు. ఇప్పటికీ బిజెపి ప్రభుత్వం నేరస్తులపై చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తున్నది.

జమ్మూలోని కథువా గ్రామం వద్ద మతోన్మాదులు ఎనిమిది సంవత్సరాల బాలికను ఒక దేవాలయంలో బంధించి, సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై జమ్ము కాశ్మీర్‌తో పాటు దేశవ్యాపితంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. అనేక ప్రాంతాలలో ప్రజలు వీధులలోకి వచ్చి ప్రదర్శనలు చేశారు. నేరస్తులను శిక్షించాలని జమ్మూలో ప్రజలు ప్రదర్శన చేస్తుంటే హంతకులకు మద్దతుగా హిందు ఏక్తామంచ్‌ నిర్వహించిన ప్రదర్శనలో ఇద్దరు బిజెపి మంత్రులు పాల్గొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో, హత్రాస్‌లలో బిజెపి నాయకులు మహిళలపై అత్యాచారాలు చేశారు. ఉన్నావోలో బిజెపి శాసనసభ్యుడు సెంగార్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కూడా ప్రభుత్వ మద్దతుతో తీవ్ర వేధింపులకు గురిచేసి, బాధిత కుటుంబాన్ని సామూహికంగా అంతం చేయటానికి ప్రయత్నించాడు. అత్యాచారానికి గురైన యువతి తండ్రిని హత్య చేయించాడు. ఈ ఘటనలపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమైన తర్వాత మాత్రమే బిజెపి అతనిని పార్టీ నుండి బహిష్కరించింది. పాలక పార్టీ, ప్రభుత్వం రక్షణగా ఉంటుంటే మహిళలపై అత్యాచారాలు చేసేవారికి కొమ్ములు రావా?

మహిళలపై వేధింపులు, అత్యాచారాలను నిరోధించటానికి చేసే కృషిలో భాగంగా మహిళలపై దాడులు, అత్యాచారాలను సమర్ధించే వారిని నిలదీయాలి. ఇటువంటి వ్యక్తులు, పార్టీలు, సంస్థల భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలి. సమాజంలో పాతుకు పోయిన అభివృద్ధి నిరోధక భావాలను తిరస్కరించాలి. స్వేచ్ఛా, సమానత్వ భావాల అభివృద్ధి కోసం కృషి చేయాలి. మహిళలను పురుషులతో సమానంగా చూసేలా అభ్యుదయ, శాస్త్రీయ భావజాలాన్ని విస్తరింపజేయటం ద్వారానే మహిళలకు రక్షణ లభిస్తుంది.

ఎ. కోటిరెడ్డి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్