ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తరాంధ్ర మణిహారంగా ‘భోగాపురం’

6 రోజుల క్రితం

cm review
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 10:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సిఎం చంద్రబాబు సమీక్ష

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆగస్టు 1 తేదీన ప్రధాని మోడీ ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, చారిత్రాత్మక ఘట్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మోడీకి ఉత్తరాంధ్ర ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలను తెలుపుతూ థింసా, సవర, కొమ్ము కోయ తదితర సంప్రదాయ నృత్య రూపాలతో ఘన స్వాగతం పలకాలని తెలిపారు. ఆగస్టు 1 తేదీన విమానాశ్రయ పాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు, జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీతో పాటు జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీలను ప్రధాని లాంఛనంగా ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం లాజిస్టిక్స్ కేంద్రంగా గ్లోబల్ కనెక్టివిటీని అందిస్తూ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక గేమ్ చేంజర్‌లా మారుతుందని సిఎం స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు, యజమానులను గౌరవించేలా వారికి ఒకమారు ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా బహిరంగ సభను నిర్వహించాలని సూచించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ స్లాట్లతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే వారి కోసం అల్పాహారం, భోజనం, తాగునీటి లాంటి సదుపాయాలు కల్పించాలన్నారు. రేపటి నుంచి జూలై 31 తేదీ వరకూ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. రానున్న పది రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రతి ఇంటా ఈ ప్రారంభోత్సవ వేడుక స్పూర్తి చేరేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని ప్రమోట్ చేస్తున్న అరకు కాఫీ బ్రాండింగ్‌ కూడా వేదికగా దీనిని మలచాలని సూచించారు. మంగళవారం నుంచి చేపట్టే కార్యక్రమాల్లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు అంతా హాజరు కావాలని నిర్దేశించారు. ఈ సమీక్షకు హోం మంత్రి అనిత, సీఎస్ సాయి ప్రసాద్, ఐ అండ్ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సివిల్ ఏవియేషన్ అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్