- ఎండిపోతున్న వరి పనలతో రంపచోడవరం కలెక్టరేట్ ఎదుట గిరిజనుల బైఠాయింపు
ప్రజాశక్తి - రాజవొమ్మంగి (పోలవరం జిల్లా) : భూపతిపాలెం ప్రాజెక్టు సాగునీటి సమస్య పరిష్కరించాలంటూ రంపచోడవరం కలెక్టర్ కార్యాలయం ఎదుట గిరిజనులు నిరసన తెలిపారు. అక్కడే బైఠాయించి ఎండిపోతున్న వరి పనలతో నినదించారు. ఆదివాసీ గిరిజన సంఘం, భూపతిపాలెం ప్రాజెక్టు రైతుల సాధన కమిటీ ఆధ్వర్యంలో సాగునీటి కోసం పోరు యాత్ర, మోటర్ సైకిల్ యాత్ర నిర్వహించారు. సోమవారం జరిగిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గిరిజన రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, గిరిజన సంఘం జిల్లా నాయకులు బొప్పెన కిరణ్, మట్ల వాణిశ్రీ, ఈతపల్లి సిరిమల్లె రెడ్డి, గంగవరం ఎంపిపి పల్లాల కృష్ణారెడ్డి, గోరగుమ్మి గ్రామ పెద్దలు, పిసా ఉపాధ్యక్షులు కోసూరి రాజరెడ్డి తదితరులు మాట్లాడారు. భూపతిపాలెం ప్రాజెక్టు పరిధిలోని రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య, పంట కాలువల మరమ్మతులు, రైతులకు జరుగుతున్న నష్టాలపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, రైతుల ఎదుట నేల మీద కూర్చొని చర్చలు జరిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని రైతులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. కెనాల్ పరిశీలన, చర్చించడం కోసం, ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులతో బాటు రైతులతోనూ, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులతోనూ ఉమ్మడి మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, ఆయా గ్రామాల గిరిజనులు... కలెక్టర్ దినేష్ కుమార్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా కలెక్టర్ హామీ మేరకు తాత్కాలికంగా గిరిజనులు ఆందోళన విరమించారు. నిర్దిష్ట సమయానికి సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ ఉద్యమం చేపడతామని లోతా రామారావు హెచ్చరించారు.








కామెంట్‌లు (0)