- రెడ్‌జోన్‌గా సిద్ధరాంపురం
ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్ధారాంపురంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. అధికారులు ఆ గ్రామాన్ని రిస్ర్టిక్టడ్ జోన్‌గా ప్రకటించి ఆదివారం అవగాహన కార్య్రకమం నిర్వహించారు. దీంతో స్థానికుల్లో ఒకింత గుబులు నెలకొంది. సిద్ధరాంపురానికి చెందిన డి.వెంకటరాముడు అనే వ్యక్తి నేషనల్ లైవస్టాక్ మిషన్ (ఎన్‌ఎల్‌ఎం) కింద నాటు కోళ్ల ఫామ్‌ను సిద్ధరాంపురంలో ఏర్పాటు చేసుకున్నారు. 2,500 కోళ్లను పూణే నుంచి తీసుకువచ్చారు. అవి వారం రోజుల క్రితం అనారోగ్యం బారినపడి చనిపోయాయి. అయితే, పెద్ద ఎత్తున కోళ్లు ఒకేసారి చనిపోవడంతో వాటిలో కొన్ని రోడ్డుపక్కనే పడేశారు. వాటిని కుక్కలు తినడమే కాకుండా గ్రామంలోకి లాక్కొచ్చాయి. దీంతో, గ్రామంలోని ఇతర కోళ్లు కూడా చనిపోయాయి. ఈ క్రమంలో నీరసించిపోయి ఉన్న కోళ్లను కొంతమంది తిన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు చనిపోయిన కోళ్ల శ్యాంపిల్స్‌ను పరీక్షించగా బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా తేలడంతో కోళ్లను తిన్న కొందరిలో గుబులు నెలకొంది. మరోవైపు కోళ్లన్నిటికీ క్రమంగా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతుండటంతో అధికారులు అప్రమత్తమై నివారణా చర్యలు చేపట్టారు.








కామెంట్‌లు (0)