- సిపిఎం ఆధ్వర్యాన పలుచోట్ల నిరసనలు
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ, గోపాలపట్నం (విశాఖపట్నం) : విశాఖ ఎయిర్ పోర్టు మూసివేతను ఖండిస్తూ, టిడిపి కూటమి ప్రభుత్వ ద్రోహాన్ని నిరసిస్తూ బ్లాక్ డేకు సిపిఎం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ ఆధ్వర్యాన విశాఖలోని పలుచోట్ల ఆదివారం నిరసనలు జరిగాయి. మద్దిలపాలెం ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ ఎయిర్ పోర్టును శాశ్వతంగా మూసివేసి విశాఖ ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. ప్రభుత్వ సంస్థ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు వచ్చిన భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్‌ను రద్దుచేసి, ప్రయివేటు జిఎంఆర్ సంస్థకు ప్రభుత్వాలు అప్పగించాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉన్న విశాఖ విమానాశ్రయాన్ని మూసివేసి, కమీషన్ల కోసం జిఎంఆర్‌కు లబ్ధి చేకూర్చిందని విమర్శించారు. ఎయిర్ పోర్టు గేటు వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం ఎయిర్‌పోర్టును డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న విమాన సర్వీసులను నిలిపివేయొద్దని కోరారు. ఆగస్టు 16 విశాఖ ప్రజలకు చీకటి రోజుగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలకుపైగా విశాఖ ప్రజలకు సేవలందించిన ఎయిర్‌పోర్ట్‌ను మూసివేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. కంచరపాలెం ఊర్వశి హైవే సెంటర్, గాజువాక ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బి పద్మ, విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి గంగారావు, ఆర్‌కెఎస్‌వి కుమార్, బి జగన్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)