స్వస్థలాలకు చేరిన వియత్నాం బోటు ప్రమాద బాధిత మృతదేహాలు
అధికారులు, ప్రజాప్రతినిధుల నివాళులు - ముగిసిన అంత్యక్రియలు
ప్రజాశక్తి- యంత్రాంగం : వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురి మృతదేహాలు మంగళవారం స్వస్థలాలకు చేరుకున్నాయి. మరణవార్త విన్నప్పటి నుండి పంటిబిగువున బాధను భరిస్తూ వచ్చిన బంధువులు, ఆప్తులు.. మృతదేహాలను చూడగానే ఒక్కసారిగా బోరున విలపించడంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది. కుటుంబసభ్యుల ఆర్తనాదాలు, ఆక్రందనలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. కన్నీటి సుడిల మధ్య కుటుంబసభ్యులు తమ వారికి అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సమన్వయంతో వియత్నాం నుంచి మృతదేహాలను ప్రత్యేక విమానంలో ముంబై, అక్కడి నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో వారి స్వగ్రామాలకు అధికారులు తీసుకువెళ్లి అప్పగించారు. కడప జిల్లాకు చెందిన యుడియం శ్రీధర్ (42) మృతదేహాన్ని నగరంలోని ఆయన స్వగృహం అరవింద్ నగర్ కు తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూసిన శ్రీధర్ సతీమణి ధనలక్ష్మి, కుమారుడు, కుమార్తె, బంధువులు బోరున విలపించారు. శ్రీధర్ మృతదేహం వద్ద బంధువులు, మిత్రులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. భౌతిక కాయానికి లావా ఇంటర్నేషనల్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ లియోడ్ డిసోజ, సిబ్బంది, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి నివాళు లర్పించారు. అనంతరం మోచంపేటలోని రామకృష్ణ స్కూల్ వద్ద గల ఆర్యవైశ్య స్మశాన వాటికలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం యువకుడు నల్లపేట రవితేజ (28) మృతదేహం స్వగృహానికి చేరుకోవడంతో టీచర్స్ కాలనీ శోకసంద్రంగా మారింది. భార్య, ఇద్దరు చిన్నారులు మృతదేహంపై పడి బోరున విలపించిన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. భౌతిక కాయానికి లావా మొబైల్ కంపెనీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి (38) భౌతికకాయాన్ని సర్కిల్ పేట లోని ఆమె నివాసం వద్ద ఉంచారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శి వై నరసింహారావు, పౌర హక్కుల సంఘం సీనియర్ నాయకులు కొడాలి శర్మ, సిఐటియు, కెవిపిఎస్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు తదితరులు నివాళులర్పించారు. వియత్నాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలక్ష్మి భర్త కిషోర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానిక స్మశాన వాటికలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.








కామెంట్‌లు (0)