ప్రజాశక్తి-పొన్నూరు (గుంటూరు జిల్లా) : చెరువులో మునిగి అన్నదమ్ముళ్లు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూ పట్టణంలో సోమవారం వెలుగు చూసింది. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక టిడ్కో గృహాల వద్ద నివాసం ఇద్దరు అన్నదమ్ముళ్లు షాజహాన్ (18) ఓ ప్రైవేటు కాలేజీలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం, సత్తార్ (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి ఎంతసేపటికీ రాకపోవడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల, బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా వారి ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయానికి కూడా పిల్లలు ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో వెదుకులాటను కొనసాగించారు. ఈ క్రమంలో యువకులిద్దరూ పట్టణ సమీపంలోని నిడుబ్రోలు వద్ద ఉన్న వంద ఎకరాల చెరువు వైపు వెళ్లడం చూసినట్లు స్థానికులొకరు చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లి చూడగా వారి చెప్పులు, దుస్తులు కనిపించాయి. దీంతో, అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల ద్వారా గంటకుపైగా గాలించగా షాజహాన్, సత్తార్ మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.









కామెంట్‌లు (0)