సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యా హక్కును ఎత్తేసి చదువును పూర్తి స్థాయి వ్యాపార సరుకుగా మార్చే విధంగా మంత్రివర్గ నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు. ప్రైవేటు విద్యా సంస్థలను కొద్ది మేరకైనా నియంత్రించేందుకు ఉన్న కొద్దిపాటి నిబంధనలను కూడా ఎత్తేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధం కావడాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. ఇప్పటికే పేద, మధ్య తరగతి ప్రజలకు ఉన్నత విద్య మోయలేనంత భారంగా మారిందని, ప్రభుత్వ విద్యా సంస్థలు నిధులు, సౌకర్యాలు లేక వెలవెలబోతున్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయాలు బోసి పోతున్నాయని, ఈ స్థితిలో ప్రభుత్వ విద్యను బలపరచాల్సిన ప్రభుత్వం దాన్ని మరింతగా దెబ్బ తీస్తున్నదని పేర్కొన్నారు. ఫ్రాన్స్, ఢిల్లీలో సాగుతున్న విద్యార్థి పోరాటాలను చంద్రబాబు విస్మరిస్తున్నట్లుగా కనిపిస్తోందని, తక్షణం ఈ విధానాన్ని ఉపసంహరించుకోకపోతే విద్యార్థుల నుండే పాఠం నేర్చుకోవాల్సి వస్తుందని గుర్తించాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ప్రోత్సాహక విధానం-2026 విద్యా వ్యాపారీకరణకు, ఫీజులు భారీగా పెరగడానికి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మరింతగా బలహీన పడటానికి కారణమవుతుందని వివరించారు. ఈ విధానం వివిధ సామాజిక తరగతులపై తీవ్ర ప్రభావం పడుతోందని, ప్రైవేట్ కళాశాలల్లో ఇప్పటి వరకు ఉన్న 70 శాతం కన్వీనర్ కోటా కొనసాగుతుందో లేదో కూడా ప్రభుత్వం స్పష్టం చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బ్రౌన్‌ఫీల్డ్ యూనివర్సిటీల పేరుతో ఉన్న ప్రైవేట్ కళాశాలలను యూనివర్సిటీలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలు లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయని, కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీ, విదేశీ ఉన్నత విద్యాసంస్థలను ప్రోత్సహించడం వల్ల రాష్ట్రంలో కన్వీనర్ సీట్ల విధానం ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో 20 ఏళ్ల నుంచి బోధనా సిబ్బంది పోస్టుల నియామకం చేయలేదని, దీనివల్ల యూనివర్సిటీల్లో అత్యధిక డిపార్ట్‌మెంట్లలో విద్యార్థులు చేరడం లేదని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసి మౌలిక సదుపాయాలు పెంచి పరిశోధనలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యా ప్రైవేటీకరణ విధానాన్ని గుడ్డిగా రాష్ట్రంలో అమలు చేస్తే పాలకులు ప్రజాగ్రహానికి గురవుతారని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)