- జులై ఒకటి నుంచి 31 వరకు : సిహెచ్ నర్సింగరావు
ప్రజాశక్తి - తిరుపతి టౌన్ : కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జులై ఒకటి నుంచి 31 వరకూ జరిగే కనీస వేతనాల క్యాంపెయిన్ ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు కోరారు. తిరుపతి యశోద నగర్‌లోని వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, ఆప్కాస్ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, విద్య, వైద్యం, గృహ అద్దెల భారంతో కార్మిక కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమతో సంపద సృష్టించబడుతున్నప్పటికీ వారి జీవన ప్రమాణాలు దిగజారడం దురదృష్టకరమన్నారు. ఇఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత వంటి కనీస హక్కులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం గురించి గొప్పలు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ... రాష్ట్రంలో కార్మికుల సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, కార్మికుల ఐక్య పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.









కామెంట్‌లు (0)