సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ప్రశ్న రావణ్’ మళ్లీ అరెస్టు

1 రోజు క్రితం

ravan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఉపా చట్టం బనాయింపు

ప్రజాశక్తి-​ గన్నవరం : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను విమర్శించిన కేసులో వరుస అరెస్టులు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్, హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ పరిధిలోని నరేంద్రనగర్ కాలనీకి చెందిన బచ్చలకురి జోసెఫ్ అలియాస్ 'ప్రశ్న రావణ్'ను గన్నవరం పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఒకే వారంలో ఆయనను అరెస్ట్ చేయడం ఇది ఐదోసారి. రావణ్ (37)ను గన్నవరం పోలీసులు క్రైమ్ నెంబర్ 188/2026 కింద శనివారం రాత్రి ఏడు గంటలకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేశారు. ఆయన గన్నవరం కోర్టులో ఆదివారం హాజరు పర్చారు. రాత్రి పొద్దు పోయేంతవరకు కోర్టులో వాదనలు కొనసాగాయి.

కేసు నేపథ్యం, నమోదైన కఠిన సెక్షన్లు

గరికపాటి శివశంకర్ జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రశ్న రావణ్ పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. 'ప్రశ్న' యూట్యూబ్ ఛానెల్ ద్వారా దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించేలా, నిషేధిత సిపిఐ (మావోయిస్టు) తీవ్రవాద సంస్థల భావజాలాన్ని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపిస్తూ ఉపా చట్టంతో పాటు పలు సెక్షన్లను నమోదు చేశారు.

ఉపా (యుఎపిఎ) చట్టం సెక్షన్లు 13, 39 (చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ప్రచారం చేయడం)

​-భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌) సెక్షన్లు 147, 148 (మారణాయుధాలతో అల్లర్లకు పాల్పడటం), 152, 192, 197 (1)(డి), 353(1) (బి) (ప్రభుత్వోద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం)

​ ఐదు రోజుల్లో ఐదోసారి అరెస్ట్

జూన్ 30న ప్రశ్న రావణ్ ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పిఠాపురం పోలీసులు మొదటగా అరెస్టు చేశారు. ఆ తర్వాత వరుసగా నాలుగు వేర్వేరు కేసుల్లో కోర్టుల నుండి ఆయనకు బెయిల్ లభించినప్పటికీ, బెయిల్ పొంది బయటకు వచ్చిన ప్రతిసారీ వేరొక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పాత కేసుల ఆధారంగా పోలీసులు తిరిగి అరెస్టు చేస్తూ వస్తున్నారు. యలమంచిలి కోర్టులో బెయిల్ పొంది విడుదలైన కాసేపటికే గన్నవరం పోలీసులు రావణ్‌ను ఈ ఐదో కేసులో అరెస్ట్ చేయడం, ఉపా (యుఎపిఎ) చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

కోర్టును ఆశ్రయించిన రావణ్

మరోవైపు తనపై జరుగుతున్న వరుస అరెస్టులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రావణ్ ఆశ్రయించారు. తనపై నమోదైన అన్ని కేసులనూ కలిపి ఒకే కేసుగా విచారించాలని, ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గన్నవరంలో బంద్‌ ‌వాతావరణం

రావణ్ ను కోర్టుకు తరలిస్తున్న సమయంలో గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత, బంద్ వాతావరణం నెలకొంది. గన్నవరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి పోలీస్ స్టేషన్ వరకు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి రహదారులను దిగ్బంధించారు. వాహనదారులను, ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్