సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘లీడర్‌’ రమణమూర్తిపై కేసులు ఎత్తివేయాలి : వామపక్ష పార్టీలు

1 గంట క్రితం

left parties
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 03:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామిక హక్కులను కాపాడాలి
విశాఖపట్నం : విశాఖకు చెందిన ‘లీడర్‌’ పత్రిక సంపాదకులు రమణమూర్తిపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ నెం.144/2026, ఎఫ్‌ఐఆర్‌ నెం.276/2026 కేసులను వెంటనే ఎత్తివేయాలని వామపక్ష పార్టీలు సోమవారం డిమాండ్‌ చేశాయి. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసులు నమోదు చేశారని ఆరోపించాయి. పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు పి. ప్రసాద్‌, యం. రామకృష్ణ, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు బి. బంగార్రావు, యంసిపిఐ(యు) నాయకులు కాటం నాగభూషణం, సిపిఐ(ఎంఎల్‌) నాయకులు జాస్తి కిషోర్‌బాబు, ఎస్‌యుసిఐ(సి) నాయకులు బి.ఎస్‌. అమర్‌నాథ్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకులు పి.వి. సుందరరామరాజు, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ నాయకులు జానకి రాములు ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ విధానాలు, గీతం భూముల వ్యవహారం, బిట్‌కాయిన్‌ అంశాలు, భూకబ్జాలు, ప్రజా సమస్యలపై ‘లీడర్‌’ పత్రికలో వార్తలు ప్రచురించినందుకు కక్షగట్టి అధికారబలమున రాజకీయ శక్తులు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం ఖండించదగిన విషయమని పేర్కొన్నాయి. ఇది ఒక్క ‘లీడర్‌’ పత్రికపైనే కాకుండా మొత్తం పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించాయి. 28 సంవత్సరాలకు పైగా చట్టబద్ధంగా కొనసాగుతున్న ‘లీడర్‌’ పత్రిక గతంలో అనేక ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిందని తెలిపాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు బడుగు, బలహీన వర్గాల సమస్యలకు గొంతుకగా నిలిచిందని పేర్కొన్నాయి. ప్రజా సమస్యలపై వార్తలు రాసినందుకు జర్నలిస్టులను క్రిమినల్‌ కేసులతో వేధించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని తెలిపాయి.

మొదటి ఎఫ్‌ఐఆర్‌లో రమణమూర్తిపై ప్రత్యక్షంగా నిర్దిష్టమైన అభియోగాలు లేనప్పటికీ అనంతరం ఆయనను కేసులో ఇరికించారని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ కేసులో రమణమూర్తి హైకోర్టును ఆశ్రయించగా, అరెస్టు చేయవద్దని, దురుసుగా వ్యవహరించవద్దని న్యాయస్థానం ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశాయి. ఆ తరువాత మరో కేసు నమోదు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నాయి. పత్రికలో ప్రచురించిన వార్తలపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా, ప్రెస్‌ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే మార్గాలు ఉన్నాయని తెలిపాయి. అయితే రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు కేసులు నమోదు చేసి జర్నలిస్టులను భయపెట్టడం, వేధించడం, పత్రికా స్వేచ్ఛను అణచివేయడం సమర్థనీయం కాదని స్పష్టం చేశాయి. వెంటనే రెండు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిని మేధావులు, ప్రజాస్వామికవాదులు, పౌరహక్కుల సంఘాలు ఖండించాలని విజ్ఞప్తి చేశాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్