మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఇచ్చే గుడ్డు 28 గ్రాములు మాత్రమే – ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలి
విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు నిర్మించాలి నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించాలి
మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు భోజనశాల ఏర్పాటు చేయాలి
ప్రజాశక్తి-అనంతపురం : విద్యార్థుల కడుపు కొడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్కూల్ బచావో’ కార్యక్రమంలో భాగంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్, గుంతకల్లు పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని, విద్యార్థులకు అందిస్తున్న గుడ్డు సుమారు 28 గ్రాములు మాత్రమే ఉంటోందని విద్యార్థులు తెలిపారని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిమాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. విద్యార్థుల కడుపు కొడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తరగతి గదుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తక్షణమే అవసరమైన గదుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పాఠశాలలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా ఉండటంతో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందడం లేదని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్‌ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఎండలో లేదా సరైన సౌకర్యాలు లేని ప్రదేశాల్లో భోజనం చేయాల్సిన పరిస్థితి లేకుండా ప్రత్యేక భోజనశాల నిర్మించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హైస్కూల్ సమస్యలను పరిష్కరించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)