- ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యాన నిరసన
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం): ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులపై బనాయిస్తున్న తప్పుడు కేసులను ఉపసంహరించాలని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ శనివారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యాన చేసిన ఆందోళనలో విశాఖ జిల్లా అధ్యక్షులు పి.సాయితేజ, యుఎస్‌ఎన్.రాజు మాట్లాడారు. ఇటీవల విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు అమానుషంగా దాడి చేయడాన్ని వారు ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనంతరం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో విద్యార్థి నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టులకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనన్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకు నాయకత్వం వహించిన ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ సహా పలువురు విద్యార్థి నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి భయబ్రాంతులకు గురిచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్యని అన్నారు. విద్యా వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే విద్యార్థులను అణచివేయడానికి కేసులు, అరెస్టులు, పోలీసు దాడులను ఆయుధాలుగా ఉపయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. విద్యార్థులపై దాడి చేసిన ఢిల్లీ పోలీసు అధికారులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కౌశిక్, మౌనిక, ప్రగతి, నరేష్, తులసి, తరుణ్, రమ్య, హృదయ, భగత్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)