బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవ్యవస్థల్లో గూడుకట్టుకున్న కులవివక్ష

1 గంట క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 10:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సామాజిక శంఖారావం వర్క్‌‌షాపులో కెవిపిఎస్, వ్యకాస నేతలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వ్యవస్థల్లో కుల వివక్ష గూడుకట్టుకుపోయిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి విమర్శించారు. కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ ఆధ్వర్యాన విజయనగరం ఎన్‌‌పిఆర్‌ భవనంలో ‌'కులవివక్ష లేని సమాజం కోసం.. సామాజిక శంఖారావం’ వర్క్‌‌షాపును బుధవారం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాడి అప్పారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో మాల్యాద్రి మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో దళితులు, గిరిజనులు సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా అన్యాయానికి గురవుతున్నారన్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా వారి పట్ల అనుసరించే విధానాలు మారడం లేదని వివరించారు. ఉన్నత విద్యనభ్యసించి, ఉన్నత స్థానాల్లో ఉన్న దళితులు కూడా కులవివక్షను ఎదుర్కొంటున్నారని, విద్యాసంస్థల్లో సైతం కులతత్వాన్ని ప్రోత్సహించే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దళితులకు భూ హక్కు కల్పించాలని, మూడు ఎకరాల మాగాణి ఇవ్వాలని కోనేరు రంగారావు కమిషన్ చేసిన సిఫార్సులు నేటికి అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలోని అనేక దళిత కాలనీల్లో ఇప్పటికీ రోడ్లు, కాలువలు, తాగునీరు వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో 12 వేల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. దళిత క్రైస్తవుల సమస్యలపై కూడా ప్రభుత్వాలు స్పందించడం లేదని వివరించారు. దళితుల సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కెవిపిఎస్, వ్యకాస, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అధ్యయన యాత్రలు నిర్వహిస్తున్నామని, ఈ యాత్రల్లో వెలుగులోకి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేపడతామని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కె.ఆంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళిత వాడల్లో ఉన్న వేలాది పాఠశాలలను మూసేశారని ఆందోళన వ్యక్తంచేశారు. వివక్షలేని సమాజం కోసం కులవివక్ష అనే అడ్డుగోడలను బద్దలు కొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, వ్యకాస జిల్లా అధ్యక్షులు జి.శ్రీనివాస్‌, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆర్.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్