నీటి విడుదల సందర్భంగా మంత్రి నిమ్మల
ప్రజాశక్తి - తాడేపల్లి (గుంటూరు జిల్లా) : ఎల్‌నినో వల్ల మన రాష్ట్రంలో కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, నదుల్లోకి ఇన్‌ఫ్లోలు లేకపోవడం వల్ల నీటిమట్టాలు అడుగంటాయని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం దగ్గర కృష్ణా పశ్చిమ డెల్టా కాలువకు నీటిని బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వలు లేనందున కృష్ణా డెల్టాకు ఇప్పటివరకు చుక్క నీరు రాలేదన్నారు. ఫలితంగా కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో వర్షాలు పడితే మరో 30 టిఎంసిలు వెరసి ఈ సీజన్లో 75 టిఎంసిల నీరు వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా డెల్టాలోని మొత్తం 13 లక్షల ఎకరాల సాగుకు 150 టిఎంసిల నీరు అవసరం అవుతుందని అంచనా కాగా 75 టిఎంసిల నీటితో కృష్ణా డెల్టా మొత్తం సాగయ్యే పరిస్థితి ప్రశ్నార్ధకమేనని పేర్కొన్నారు. రైతులు ఈ విపత్కర పరిస్థితిని అర్థం చేసుకుని ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం ఉపయోగించుకోవాలని, ఆ తరువాత ఆరుదల పంటలకు, తక్కువ కాలపరిమితి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కెడిఎస్ సిఇ రాంబాబు, రాష్ట్ర సాగు నీటి సంఘాల ప్రతినిధులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)