శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కుల వివక్షను రూపుమాపాలి

4 గంటల క్రితం

dalit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 11:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- దళితుల సమస్యలపై జిఒ 1235 అమలు చేయాలి

- ఉమ్మడి కర్నూలు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, నెల్లూరులో సామాజిక శంఖారావం

ప్రజాశక్తి - యంత్రాంగం : కుల వివక్షను రూపుమాపాలని, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, ఎస్ సి, ఎస్ టి సబ్ ప్లాన్ ను పటిష్టంగా అమలు చేయాలని ఎపి రైతు సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం తుమ్మలూరు , ఇస్కాల గ్రామంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన నేతృత్వంలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎ. రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్. బాలయ్య, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి. సోమన్నలు శుక్రవారం రాత్రి తుమ్మలూరు గ్రామంలో బసచేశారు. శనివారం ఉదయం ఇస్కాల గ్రామంలో పర్యటించారు. సిసిరోడ్లు, డ్రెయినేజీలు లేవని ప్రజలు ప్రజాసంఘాల నాయకుల ఎదుట దళితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కుల వివక్షను రూపుమాపేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. చాలా గ్రామాల్లో ఇప్పటికి రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతోందని, దళితులకు ఆలయ ప్రవేశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన జిఒ1235ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాటికాపరులను వృత్తిదారులుగా గుర్తించి నాలుగో తరగతి ఉద్యోగస్తులుగా నియమించి ఆదుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా ఆలూరు, ఎమ్మినూరు, పెద్దకడుబూరు మండలాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దళితుల సమస్యలపై అధ్యయనం చేశారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం చెరుకుపల్లి, హరిదాసుపురం, ప్రతాప్ విశ్వనాథపురం గ్రామాల దళిత వాడల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొల్లి ఎల్లయ్య, యుటిఎఫ్ నాయకులు బి.సింహాచలం పర్యటించారు. స్మశాన వాటికలు, రోడ్లు లేకపోవడాన్ని గుర్తించి వాటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరులో కెవిపిఎస్‌, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన బృందం పర్యటించింది. ఆచంట మండలం ఆచంట వేమవరం పరిధిలోని పెద్దపేట,హరిజన పేట, నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో వ్యవసాయ, కౌలు రైతు సంఘం నాయకులు పర్యటించి దళితుల సమస్యలపై అధ్యయనం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్