సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరావతిలో క్వాంటం బయో వ్యాలీ

12 సెప్టెంబర్, 2026

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- జాతీయ ప్రాజెక్టు 
హోదా ఇవ్వండి

- కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి

- సహకరిస్తామన్న జెపి నడ్డా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధాని అమరావతిలో క్వాంటం బమో వ్యాలీని ఏర్పాటు చేస్తామని, దానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చి సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. శనివారం విజయవాడలోని పాత ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబరేటరీలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా10 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబరేటరీ లను కేంద్ర మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.

అనంతరం బిఆర్‌ అంబేద్కర్‌ కళావేదికలో జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైద్యారోగ్య రంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతిలో క్వాంటం బయో వ్యాలీని ఏర్పాటు చేస్తామని, దానికి అన్ని విధాల సహకరించాలని కోరారు. అమరావతిని భవిష్యత్‌ సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్‌ అమరావతిలోనే ప్రారంభం కానుందని తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కుప్పంలో ఇప్పటికే ప్రారంభమైన సంజీవని కార్య్రకమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఇది వైద్య రంగంలో గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని చెప్పారు. జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నామని తెలిపారు.. వంటశాలను ఫార్మసీగా, ఆహారాన్ని ఔషధంగా భావించి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. యోగా, ప్రాణాయామం, ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించామని గుర్తుచేశారు. కేంద్ర సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఎపిను దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌’ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా మాట్లాడుతూ అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం నుంచి సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామని చెప్పారు. క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటుపై చంద్రబాబు ఆలోచన బాగుందని, ఆయన చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంజీవని కార్యక్రమాన్ని ప్రశంసించారు. సంజీవని అద్భుతమైన కార్యక్రమమని, దీనిని జాతీయ స్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, నివారించడం, మెరుగైన చికిత్స అందించడం, అందుబాటు ధరల్లో వైద్య సేవలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి చేపడుతున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చన్నారు.రాష్ట్రంలో పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ, హంద్రీ, నీవా వంటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరించారు. అంతకుముందు .ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌,విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్‌ మాధవ్‌, ఎంఎల్ఎ బోండా ఉమ, ఎంఎల్ సి సోము వీర్రాజు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి వీరపాండియన్, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ చక్రధర్ బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ, వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్