శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజేరియన్ ప్రసవాలు 35శాతానికి తగ్గించాలి

2 గంటల క్రితం

satya kumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 09:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రభుత్వాసపత్రుల్లో డయాగ్నస్టిక్‌ పరీక్షల రద్దీని తగ్గించాలి

  • సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌

‌ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సిజేరియన్‌ ‌ప్రసవాలు తగ్గించి సహజ ప్రసవాలను పెంచాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ‌యాదవ్‌ చెప్పారు. సిజేరియన్ ఆపరేషన్లు తాత్కాలికంగా ఉపశమనాన్ని కల్పించినా తల్లీబిడ్డలకు అది ప్రయోజనకరం కాదని తెలిపారు. సిజేరియన్లు, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య నిర్ధారణ పరీక్షల నిర్వహణపై సచివాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వమించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ అసుపత్రుల్లో జరుగుతోన్న మొత్తం ప్రసవాల్లో 51శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న మూడేళ్లల్లో(2028-29) 35శాతానికి తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతోన్న సిజేరియనపై పటిష్టమైన ఆడిటింగ్ జరగాలని, ఆకారణంగా జరిగే వాటికి అడ్డుకట్ట వేయాలని చెప్పారు. 20 ప్రభుత్వాసుపత్రుల్లో పైలటు ప్రాతిపదికన నెలరోజులపాటు జరిగే సిజేరియన్లపై సమగ్రమైన ఆడిటింగ్ చేసి, ప్రసవాల సరళి, కారణాలపై నివేదిక అందించాలని ఆదేశించారు.ప్రైవేటు ఆసుపత్రులపై డిఎం అండ్‌ ‌హెచ్‌ఓల పర్యవేక్షణను పటిష్టంచేసి అడిటింగ్, ఇతర చర్యల ద్వారా సిజేరియన్లను అడ్డుకోవాలని తెలిపారు. సహజ ప్రసవాల ద్వారా పిల్లలకు జన్మనిస్తోన్న తల్లులకు ప్రత్యేక ప్రోత్సాహాకం అందించే దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.

​వైద్య నిర్ధారణ పరీక్షలకు టోకెన్లు

​ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య నిర్ధారణ (డయాగ్నస్టిక్ టెస్టు) పరీక్షలకు డిమాండ్ పెరిగి రోగులు గంటలకొద్దీ వేచి ఉంటున్నారని మంత్రి తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణ విధానాన్ని సమగ్రంగా మార్చి, నిర్ణీత సమయంలో వైద్యులు సూచించిన సేవలు అందుతాయన్న భరోసా రోగుల్లో కల్పించాలని తెలిపారు. వారంరోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. నూతన పరీక్షల నిర్వహణ విధానాన్ని విశాఖలోని కేజీహెచ్, విజయవాడ జీజీహెచ్ తోపాటు ఎంపికచేసిన సెకండరీ ఆసుపత్రుల్లో పైలటుగా అమలుచేసి, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేయాలని సూచించారు. ప్రతి రోగికి టోకెన్లు ఇచ్చి, ముందుగా వచ్చిన వారికి ముందుగా నిర్దిష్ట సమయంలో పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వైద్య నిర్ధారణ పరీక్షల నిర్వహణలో పిపిపి యంత్రాలు కాకుండా ప్రభుత్వ యంత్రాల వినియోగం పెరగాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కెవిఎన్‌ ‌చక్రధర్‌ ‌బాబు, డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విష్ణువర్ధన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్