ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నవంబర్ 5న చలో విజయవాడ

04 అక్టోబర్, 2026

నవంబర్ 5న చలో విజయవాడ
- ఎపి కాంట్రాక్ట్, అవుట్‌‌సోర్సింగ్‌ జెఎసి రణభేరి సదస్సు
-  జెఎసి రాష్ట్ర చైర్మన్ కాంతారావు, గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 09:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​- ఎపి కాంట్రాక్ట్, అవుట్‌‌సోర్సింగ్‌ జెఎసి రణభేరి సదస్సు

- జెఎసి రాష్ట్ర చైర్మన్ కాంతారావు, గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి: ​గత 20 సంవత్సరాలుగా సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూశామని, ఇకపై ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని ఎపి కాంట్రాక్ట్, అవుట్‌‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ అండ్ టీచర్స్ జెఎసి స్పష్టం చేసింది. ప్రభుత్వం సమస్యలపై స్పందించకపోతే వచ్చే నవంబర్‌ ఐదున ‘చలో విజయవాడ’కు రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఉద్యోగులతో అతి పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటిం‌చింది. జెఎసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సుల్లో భాగంగా రాజమహేంద్రవరంలో రమణం శ్రీ రాములు కల్యాణ మండపంలో మొట్టమొదటి మహాగర్జన పేరుతో ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించారు. జెఎసి రాష్ట్ర చైర్మన్ కాంతారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో కాంట్రాక్ట్ , అవుట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగులకు చేసింది ఏమీ లేదన్నారు. వైసిపి, టిడిపి కూటమి ప్రభుత్వాలు రెండూ ఎంటిఎస్ హక్కును రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశాయన్నారు. రూ.ఏడు వేలు, రూ.ఎనిమిది వేలు వేతనం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులని చెబుతూ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారని గుర్తుచేశారు. ప్రశ్నిస్తాం అన్న పవన్ కల్యాణ్ గొంతు అధికారంలోకి రాగానే మూగబోయిందని విమర్శించారు. రాష్ట్రంలోని మూడున్నర లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీవన పరిస్థితు‌లను పక్కన పెట్టి అంబాని, అదాని వంటి కార్పొరేట్ల సేవల్లో పాలకులు తరిస్తున్నారని వివరించారు. 50 లక్షల మంది కార్మికులకు పెండింగ్‌‌లో ఉన్న వేతన సవరణను పట్టించుకోవట్లేదన్నారు. జెఎసి చైర్మన్ బి కాంతారావు మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల భేటీలో కాంట్రాక్ట్ అవుట్‌‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై కనీస చర్చ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకట సుబ్బయ్య, కాంట్రాక్ట్ అవుట్‌‌సోర్సింగ్‌ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి దయామణి మాట్లాడుతూ మన హక్కులు అడుగుతుంటే ప్రభుత్వం ఉన్న హక్కులను తొలగిస్తోందన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవట్లేదని, ఈ నేపథ్యంలో మనం ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ శాఖల సంఘాల రాష్ట్ర నాయకులు రవి ప్రకాష్, కల్యాణి, గంగాధర్, గాంధీ, శశికళ, రాజశేఖర్, సురేష్, జె వెంకటేశ్వరావు, సుధీర్ ప్రసంగించారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్