ఆర్థిక పరిస్థితి బాలేకున్నా హామీల అమలు
పల్లె పండుగ 3.0 సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టామని, పల్లె పండుగతో గ్రామాల్లో కాంతులు వెదజల్లుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి మంగళవారం ఆయన హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.11,085 కోట్లతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. రూ.2,700 కోట్లతో ఆరు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కిలోమీటర్ల బిటి రోడ్లు, రూ.200 కోట్లతో బస్ షెల్టర్లు, పంచాయతీ భవనాలు, రచ్చబండలు, రూ.110 కోట్లతో వెయ్యి కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు, రూ.300 కోట్లతో 22 వేల మినీ గోకులాలు నిర్మించే, రూ225 కోట్లతో 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు చేపట్టే పనులు వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ అర్హులందరికీ ఇల్లు, ఇంటి స్థలం అందించేందుకు, విద్యుత్తు, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేదరికం లేని గ్రామాలను తీర్చిదిద్దాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.10 లక్షల కోట్ల అప్పులు వైసిపి ప్రభుత్వం అందించిందని, ఖాళీ ఖజానాను అప్పగించిందని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ‘తల్లికి వందనం’ కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ డబ్బులు ఇచ్చామని, స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, ప్రతి నెలా ఒకటో తేదీన క్రమం తప్పకుండా సామాజిక పెన్షన్లు ఇస్తున్నామని, అన్నదాత సుఖీభవ పథకం కింద హామీ ఇచ్చిన విధంగా డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామని వివరించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తున్నామని, అముల్ బ్రాండ్ తో సమానంగా స్వయం బ్రాండ్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును తానే ప్రారంభించానన్నారు. వర్షం పడినప్పటికీ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం ఇంకా ఉందన్నారు. విజయవాడలో 24 వేల మందికి పట్టాలివ్వబోతున్నామని, త్వరలో రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు కల్పిస్తామన్నారు. చంద్రబాబు విజన్‌తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని ప్రజలు ఆదరించాలని కోరారు. మంత్రులు ఎన్ఎండి ఫరూర్, ఆనం రామనారాయణరెడ్డి, పి.నారాయణ, జనార్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్ , వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)