శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘గొల్లపల్లి’ ఘటనపై ముఖ్యమంత్రి విచారం

1 గంట క్రితం

ffds
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 08:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: శ్రీ సత్యసాయి జిల్లాలో ఐదుగురు మహిళల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపల్లి జలాశయంలో మునిగి పుష్పలత, గాయత్రమ్మ, అశ్విని, షేక్ హసీనా, అత్తర్ మాహీ అనే ఐదుగురు మహిళలు మృత్యువాత పడటంపై శుక్రవారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనపై సిఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ను చూసేందుకు వెళ్లి జారి పడ్డారని, మత్య్సకారులు గుర్తించి మృతులను బయటకు తీశారని అధికారులు సిఎంకు వివరించారు. మృతులంతా పెనుకొండ మండలం దుర్గాపేట వాసులని తెలిపారు.

ప్రగాఢ సానుభూతి తెలిపిన డిప్యూటీ సిఎం

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుగొండ మండలం, గొల్లపల్లి రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు మునిగి ఐదుగురు మహిళలు మృతి చెందిన ఘటన పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికిగల కారణాలను జిల్లా కలెక్టర్‌ని అడిగి తెలుసుకున్నారు. విహారయాత్రకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పర్యటక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని, రిజర్వాయర్లు, లోతైన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఐదుగురు మహిళల మృతిపై జగన్‌ దిగ్భ్రాంతి

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి ఐదుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన మహిళలు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్