ప్రజాశక్తి-చాగల్లు: తూర్పు గోదావరి జిల్లా కొత్తకొలమూరులో నిర్వహించిన అండర్-17 టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో చిక్కాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు అత్యుత్తమ ఆటతీరుతో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపికైన వారిలో ఎస్. దీవెన (9వ తరగతి), ఎన్. అమృత (9వ తరగతి), కె. లాస్య (8వ తరగతి), సీహెచ్. హరి (10వ తరగతి), ఎన్. నాగచైతన్య (9వ తరగతి), ఎస్. విష్ణు (8వ తరగతి) ఉన్నారు.
ఈ నెల 8, 9 తేదీల్లో బాపట్లలో జరగనున్న రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో ఈ ఆరుగురు విద్యార్థులు పాల్గొంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు తంగెళ్ల గంగాధరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ చైర్మన్ గుబ్బల రాము, గ్రామ పెద్దలు అభినందించారు.








కామెంట్‌లు (0)