శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలల సంరక్షణే సమాజం ఉమ్మడి బాధ్యత

1 గంట క్రితం

judicial
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 09:21 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- జువైనల్‌ జస్టిస్‌ చట్టం అమలుకు దశాబ్దం పూర్తి

- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లిసాగిల్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బాలల సంరక్షణ, రక్షణ కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత కాదని, సమాజం మొత్తం ఉమ్మడిగా బాధ్యత తీసుకున్నప్పుడే ప్రతి చిన్నారికి న్యాయం, భద్రత, విద్య, పునరావాసం అందుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌ అన్నారు. చట్టంతో విభేదించిన బాలలైనా, సంరక్షణ అవసరమైన బాలలైనా ముందుగా వారిని పిల్లలుగానే చూడాలని, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అండగా నిలవాలని సూచించారు. జువైనల్‌ జస్టిస్‌ (కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌) చట్టం–2015 అమలుకు దశాబ్దం పూర్తయిన సందర్భంగా శనివారం విజయవాడలోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కళావేదికలో ‘చట్టం అమలు దశాబ్దం ప్రస్థానం, భవిష్యత్‌ కార్యాచరణ’ అంశంపై రాష్ట్ర స్థాయి సంప్రదింపుల సమావేశానికి లీసా గిల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సదస్సు కేవలం లాంఛనప్రాయ కార్యక్రమంగా ముగిసిపోకుండా, బాలల భవిష్యత్తు కోసం చేసే కీలక పెట్టుబడిగా ప్రతి ఒక్కరూ భావించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జువైనల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక బాలల రక్షణ యూనిట్లు వంటి వ్యవస్థలు విస్తరించినప్పటికీ, శిక్షణ పొందిన మానవ వనరుల కొరత, బాలల అనుకూల విధానాల అమలులో లోపాలు వంటి సవాళ్లు ఇంకా ఉన్నాయని తెలిపారు. వీటిని అధిగమించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ బెదిరింపులు, ఆన్‌లైన్ వేధింపులు వంటి కొత్త సవాళ్లు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు న్యాయ, పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖలు వేగంగా, సమన్వయంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల రక్షణలో ఏ ఒక్క వ్యవస్థ ఒంటరిగా పనిచేసి ఆశించిన ఫలితాలను సాధించలేదని తెలిపారు.ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద భిక్షాటన చేస్తున్న పిల్లలను చూసి నిర్లక్ష్యం చేయకుండా, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా స్పందించాలని పిలుపునిచ్చారు. పిల్లలే దేశానికి అత్యంత విలువైన సంపద అని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రతికూల పరిస్థితులను అధిగమించి సమాజానికి ఆదర్శంగా నిలిచిన 21 మంది బాలలను జస్టిస్ లిసా గిల్ ఘనంగా సత్కరించారు. జువైనల్ జస్టిస్ కమిటీ చైర్‌పర్సన్ జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో జువైనల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక పోలీసు యూనిట్ల ఏర్పాటు ద్వారా బాలల రక్షణ వ్యవస్థ విస్తరించిందన్నారు. పేదరికం, పట్టణీకరణ, నిరక్షరాస్యత తదితర కారణాలతో నేరాల బాట పడుతున్న బాలల విషయంలో నిర్బంధం, శిక్ష ఒక్కటే అంతిమ పరిష్కారం కాదని స్పష్టం చేశారు. పిల్లలను నిరంతరం నిందితులుగా చూడకుండా, వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని, సంరక్షణ, రక్షణ, విద్య, పునరావాసానికి ప్రాధాన్యతనిచ్చే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. చట్టంతో సంబంధం ఏర్పడిన ప్రతి చిన్నారికి ఆత్మగౌరవం, భద్రత, నాణ్యమైన విద్య, అవసరమైన సంరక్షణ అందేలా చర్యలు తీసుకోవాలని, వారు భవిష్యత్తులో సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా ఎదిగేలా సమగ్ర కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జువెనైల్ జస్టిస్ కమిటీ సభ్యులు జస్టిస్ చల్లా గుణరంజన్ ,మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి , రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జి సూర్యకుమారి , రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి ఎస్ భానుమతి , జువైనల్ జస్టిస్ కమిటీ సభ్యురాలు జస్టిస్ కిరణ్మయ్ మండవ, జస్టిస్ బి ఎస్ భానుమతి , జువైనల్ విభాగం డైరెక్టర్ (ఎఫ్‌ఎసి)వి వసంతబాల ఎపిఎస్‌ఎల్‌ఎస్‌ఎ మెంబర్ సెక్రటరీ బిఎస్ వి హిమబిందు, యునిసెఫ్‌ ‌లోని సిపిఎస్‌ఎస్‌ యూనిట్ హెడ్ డా ఇసిడోర్ ఫిలిప్స్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు, మంగళగిరి ఎయిమ్స్ ప్రొఫెసర్, హెచ్‌ ఒడి అవుల విజయచంద్రా రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) చిన్నంశెట్టి రాజు , జువైనల్ జస్టిస్ కమిటీ సభ్యులు జస్టిస్ వి సుజాత, డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప, జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ కె సురేష్ రెడ్డి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ సెక్రటరీ, హెచ్ అమర రంగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్